వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుంటే రాజీనామా చేయండి: కెసిఆర్, సోనియాపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రులు సిగ్గుంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. ఇందిరాపార్కు వద్ద సమర దీక్షలో ఆయన మాట్లాడారు. సమర దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినా తెలంగాణ ప్రజలు పోరాడి అనుమతిని తీసుకు వచ్చారన్నారు. తెలంగాణ కోసం కార్యకర్తలు చిత్రహింసలకు గురవుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు పదవులు లేకుంటే బతకలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణవాదుల నుండి ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదురైతే తానైతే ఎప్పుడో పదవులకు రాజీనామా చేసేవాడినని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు నేతలు తిట్లు తింటూ పదవుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు.

తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని, న్యాయమైన డిమాండు అని, తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని, మరోసారి తమ సభలను, సమావేశాలను అడ్డుకుంటే ఖబర్దార్ అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షను గుర్తించనప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చేది లేదని కేంద్రం చెబుతున్నా కాంగ్రెసు నేతలు ఇంకా ఆ పార్టీలో కొనసాగుతామని చెబుతున్నారని మండిపడ్డారు.

మూడు తరాల కాంగ్రెసు నాయకత్వం తెలంగాణకు శాపంగా మారిందన్నారు. ఏకాభిప్రాయం అని సీమాంధ్ర నేతలు అంటున్నారని, ఏకాభిప్రాయం ఎక్కడ కుదురుతుందన్నారు. తెలంగాణా కావాలా వద్దా అని అడగాల్సింది ఆంధ్రా ప్రాంతంలో కాదని తెలంగాణలో అన్నారు. రాజమండ్రి ఎంపి ఉండల్లి అరుణ్ కుమార్‌ది దిక్కుమాలిన సభ అన్నారు. కాంగ్రెసు నాయకత్వంలో తెలంగాణ సర్వనాశనం అయిందన్నారు. ఈ దఫా ఉద్యమానికి పన్నెండేళ్ల చరిత్ర ఉందన్నారు.

రాజమండ్రిలో సభ పెట్టి సమైక్యాంధ్ర సభ అంటే ఎలా అన్నారు. తెలంగాణ వస్తుందనే ప్రచారం జరిగితే.. సీమాంధ్ర నేతలు సూటుకేసులతో ఢిల్లీకి వెళతారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెసు నేతలకు సిగ్గు శరం ఉంటే తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం అంతా ఓవైపు ఉంటే తెలంగాణ మంత్రులు మరోవైపు ఉన్నారన్నారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేయాలన్నారు.

ప్రజాస్వామ్య పద్దతుల్లో ఉద్యమం కొనసాగాలన్నారు. గమ్యం చేరేదాకా అందరం ఉద్యమించాలన్నారు. పార్లమెంటులో చెప్రాసీకి ఉన్న తెలివి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేదని ధ్వజమెత్తారు. వచ్చే బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవాలని సూచించారు. జానారెడ్డికి జెఏసి గురించి మాట్లాడే హక్కు లేదని, సోనియా గాంధీ తెలంగాణను రాచిరంపాన పెడుతోందన్నారు. తాము రాజీనామాలు చేయమని జానా రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతున్నారన్నారు.

కాంగ్రెసు నేతలను తిట్టేందుకు డిక్షనరీలో పదాలు కూడా లేవన్నారు. తెలంగాణ నుండి వచ్చే ఆదాయం ఆంధ్రా నుండి వచ్చే ఆదాయం కన్నా మూడు రెట్లు ఎక్కువ అన్నారు. మూడువందల ఏళ్ల నుండే తమది షేర్వాణీ, ఖూర్భాణీ, బిర్యానీ అన్నారు. కేంద్రం మెడలు ఎలా వంచాలో జెఏసిలో చర్చిస్తామన్నారు. తెలంగాణ కోసం మనం ఒత్తిడి తెస్తుంటే సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారన్నారు. ఆదాయం ఇక్కడ ఖర్చు అక్కడ అని ధ్వజమెత్తారు.

ఉండవల్లిపై నిప్పులు

ఉండవల్లి రాజమండ్రిలో సభ పెట్టినందువల్ల తన మాటలను అక్కడి వారు విని తరించారన్నారు. తమకు అన్యాయం చేస్తున్నారు కాబట్టే రాక్షసులు అంటున్నామని, వందసార్లు అంటామన్నారు. తెలంగాణలో కోటి ముప్పై లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారా? ఉండవల్లి చెప్పాలని సవాల్ విసిరారు. ఉండవల్లిది దిక్కుమాలిన సభ అన్నారు. తెలంగాణ కోసం ఏకాభిప్రాయం కుదురుతుందా అని ప్రశ్నించారు.

బండారు దత్తాత్రేయ

కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్‌ల ప్రకటనలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కేంద్రం ఆటలాడుకుంటోందన్నారు. కేంద్రానికి కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల మనోభావాలు పట్టవన్నారు. అందరం కలిసి తెలంగాణ కోసం పోరాడి సాధించుకోవాలన్నారు.

తెలంగాణ రావాలంటే కాంగ్రెసును బొంద పెట్టాలన్నారు. దగా, మోసం చేస్తున్న కాంగ్రెసును కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. తెలంగాణవాదుల ఉత్సాహం చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏ క్షణంలోనైనా పడిపోతుందనిపిస్తోందన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందన్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్‌ను నిలదీస్తామని ఆయన అన్నారు.

కోదండరామ్

తెలంగాణ సమర దీక్షకు వస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి చర్చలు అవసరం లేదన్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంప్రదింపులు, చర్చలు అనడం బూటకమే అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ డిమాండును ఆమోదించాలని, తెలంగాణ వ్యతిరేక పార్టీలను రాజకీయ సమాధి చేయాలన్నారు. విశాలాంధ్ర సమితి నేత పరకాల ప్రభాకర్, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన దీక్షలో పాల్గొన్న వారు నిప్పులు చెరిగారు. వారికి సవాళ్లు విసిరారు.

English summary
TRS chief K Chandrasekhar Rao has demanded Telangana Ministers resignation on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X