తెలంగాణ మంత్రుల రాజీనామా!? ఇక ఎమ్మెల్యేలుగా...

గత నెల జరిగిన అఖిల పక్ష సమావేశం సందర్భంగా నెల రోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి సుశల్ కుమార్ షిండే ప్రకటించారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై తీవ్ర కసరత్తు చేసింది. తెలంగాణపై అనుకూల ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు లాబీయింగ్ చేసి తెలంగాణపై ప్రకటనను అడ్డుకున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారని కానీ, తెలంగాణ మంత్రులు మాత్రం తెలంగాణ కోసం ఆ స్థాయిలో ఒత్తిడి తేలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 28వ తేదీ వరకు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాకపోవడం, వచ్చిన తెలంగాణను సీమాంధ్ర నేతలు మరోసారి అడ్డుకున్నారని ఆరోపిస్తూ జెఏసి తెలంగాణ కాంగ్రెసు నేతలపై మండిపడుతోంది.
తెలంగాణ ఎంపీలు రాష్ట్రం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డెక్కుతున్నారు. కానీ, మంత్రుల్లో మాత్రం కదలిక లేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. వారు కేవలం పదవులు అంటిపెట్టుకొని తెలంగాణను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెసు నేతలను, ప్రధానంగా మంత్రులనే లక్ష్యంగా చేసుకుంటామని, మంత్రుల ఫోటోలను తెలంగాణ ద్రోహులని ముద్రించి వాల్ పోస్టర్లు వేస్తామని జెఏసి హెచ్చరించింది.
జెఏసి ప్రధానంగా తమనే టార్గెట్‌గా చేసుకోవడంతో మంత్రులు పునరాలోచనలో పడ్డారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా తెలంగాణపై తరచూ మాట మార్చుతుండటం వారికి మింగిడు పడటం లేదు. అధిష్టానం వైఖరి, తెలంగాణవాదులు తమనే టార్గెట్‌గా చేసుకోవడంతో మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం భేటీలో వారు ఓ నిర్ణయానికి రానున్నారు.












Click it and Unblock the Notifications