బాబుకు షాక్ మీద షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

తాజాగా బాబుకు మరో షాక్ తగులనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పి.సాయిరాజ్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ రోజు ములాకత్ సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు. కొంతకాలంగా సాయిరాజ్ పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. సాయిరాజ్‌తో పాటు జిల్లాకు చెందిన పాతపట్నం పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జీ కలమట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావులు కూడా ఆయన బాటే పట్టే అవకాశాలు ఉన్నాయి.
వీరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఆంజనేయరాజు కూడా ఇదే బాటలో నడువనున్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి ఫ్యాక్స్‌లో రాజీనామా పంపారట.
కాగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు జైలులో జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. మరుక్షణమే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టిడిపి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రబాబు విధానాలు నచ్చకే తాను టిడిపిని వీడుతున్నట్లు జగన్‌తో భేటీ తర్వాత జైలు బయట రామారావు విలేకరులకు చెప్పారు. కుటుంబసమేతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పని చేసేందుకు సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications