చిరులాగా అమ్ముడుపోతే సరి: బాబుకు షర్మిల సలహా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని, దానికి బదులు పూర్తిగా చంద్రబాబు కాంగ్రెసుకు అమ్ముడుపోతే మంచిదని ఆమె అన్నారు. ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వం చంద్రబాబు పాలనను తలపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. వ్యవసాయం దండుగ అని భావించి చంద్రబాబు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు తన పాలనలో 4 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేసి జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టించాయని అన్నారు. జగనన్న బయట ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీలు భయపడ్డాయని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వా తీర్మానం ప్రతిపాదించే బలం తెలుగుదేశం పార్టీకి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదని అన్నారు. కిరణ్ ప్రభుత్వం చంద్రబాబు పాలన పార్ట్ 2 మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో షర్మిల ఈ నెల 22వ తేదీ వరకు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో బస చేయనున్నారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జనక్ ప్రసాద్, తలశిల రఘురాం వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన షర్మిల పాదయాత్ర నల్లగొండ జిల్లా సరిహద్దులు దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని వారు చెప్పారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న జనంలో పది శాతం మంది కూడా చంద్రబాబు పాదయాత్రకు రావడం లేదని వారన్నారు. వాడపల్లిలో బస చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టర్ నుంచి షర్మిలకు అనుమతి ఇచ్చారు.












Click it and Unblock the Notifications