గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చొక్కాపట్టి అడిగితే: షర్మిల, బాబు నీచుడు: విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
గుంటూరు/హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతున్న ధర్నాలో పాల్గొన్నారు. షర్మిల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇదే జిల్లాలో కొనసాగుతోంది.

విజయమ్మ కూడా ఇదే జిల్లాలో ధర్నాలో పాల్గొన్నారు. అదే సమయంలో పాదయాత్రలో భాగంగా అదే ప్రాంతానికి వచ్చిన షర్మిల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ప్రభుత్వానికి ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిందని ఆరోపించారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె మండిపడ్డారు. రైతులు, ప్రజలు విద్యుత్ కోతల వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం అన్నారు.

రుణ మాఫీ చేస్తానంటున్న చంద్రబాబు తన హయాంలో ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. అబద్దపు కేసులు పెట్టి జగన్‌ను జైలులో పెట్టించారన్నారు. జగన్ అధికారంలోకి వస్తారని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరుస్తారన్నారు. బాబు ప్రతిపక్ష నాయకుడుగా కాకుండా ప్రతినాయకుడు(విలన్)గా తయారయ్యారన్నారు. ప్రజల దగ్గరకు వెళ్తే పాలకులకు కరెంట్ కష్టాలు తెలుస్తాయన్నారు.

ఇంతకంటే ఘోరమైన కరెంట్ సంక్షోభం ఎప్పుడూ లేదన్నారు. చొక్కా పట్టుకొని నిలదీస్తే కానీ పాలకులు వినేలా లేరన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని ప్రతిరోజు బాబును అడుగుతున్నామని చెప్పారు. అయినా ఆయన పెట్టడం లేదని, అవిశ్వాసం అంటేనే బాబుకు వైయస్సార్ కాంగ్రెసు గుర్తుకొస్తుందన్నారు. జగన్ ఏ తప్పు చేయలేదని, ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు.

అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారికంగా పవర్ హాలీడే ప్రకటిస్తోందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. తుఫాన్‌ల నష్టపరిహారం ఈ కాంగ్రెసు పాలనలో రైతులకు అందడం లేదన్నారు. రైతులు కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుదుత్పత్తి తగ్గిన సంగతి ప్రభుత్వానికి ముందుగా తెలియదా అని ప్రశ్నించారు.

బాబు వంటి నీచ ముఖ్యమంత్రి లేరన్నారు. ఆయన తన తొమ్మిదేళ్ల కాలంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టారన్నారు. వైయస్ అవినీతిపరుడు అని బాబు గుండెపై చెయ్యి వేసుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజల రక్తం పిండుకున్న ఘనతబాబుదే అన్నారు. కృష్ణా నది నీరు రాకపోవడానికి బాబే కారణమన్నారు. చరిత్రను బాబు వక్రీకరిస్తున్నారని, ప్రజలకు గుర్తుందన్నారు. బాబు తన స్వభావాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.

వైయస్ ఒక్క రూపాయి ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఇచ్చారన్నారు. బాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపించారన్నారు. కాగా, ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్తెనపల్లి నుండి పాదయాత్ర ప్రారంభం

అంతకుముందు షర్మిల పాదయాత్ర గుంటూరు జిల్లా సత్తెనపల్లి ముస్లిం బజార్ నుంచి ప్రారంభమైంది. షర్మిల యాత్రకు అల్పసంఖ్యాకవర్గ(మైనార్టీ)లు ఘన స్వాగతం పలికారు. షర్మిలకు వారు ఖురాన్‌ను బహూకరించారు. అయిదు లాంతర్ల సెంటర్ మీదుగా పార్టీ చేపడుతున్న నిరసన వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నాలో పాల్గొన్నారు.

English summary

 YSR Congress party honorary president YS Vijayamma and Sharmila participated in dharna at Sattenapally of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X