ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెసుకు వైయస్ జగన్ భయం?

కాంగ్రెసు ఐదుగురిని, తెలుగదేశం పార్టీ ముగ్గురిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకరిని రంగంలోకి దింపితే 17 మంది శాసనసభ్యులున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మహమూద్ అలీ కూడా బయటపడుతారు. మార్చి 21వ తేదీన పది మంది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెరాసకు ఓ అనుబంధ సభ్యుడు ఉన్నారు. అలాగే, తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా తెరాసకు మద్దతు ప్రకటించారు. నలుగురు శానససభ్యులున్న సిపిఐ, ముగ్గురు సభ్యులున్న బిజెపి ఇంకా ఏ విషయమూ తేల్చలేదు. మజ్లీస్ కూడా ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా 17 మంది శానససభ్యులున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి బహిరంగంగా ముందుకు వచ్చిన సభ్యులు డజన్ మంది దాకా ఉన్నారు. వీరితో ఓ స్థానాన్ని గెలుచుకోవడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సాధ్యమవుతుంది. అయితే, వారిపై స్పీకర్ వేటు వేస్తే, 11వ అభ్యర్థి రంగంలో ఉంటే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. అయితే, మజ్లీస్ సహకారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉంటుందని పూర్తిగా చెప్పలేని స్థితి.
మజ్లీస్ ముందుకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ప్రకటిస్తే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా అనేది ప్రశ్న. తాము ఆరో అభ్యర్థిని పోటీకి దింపితే, వైయస్సార్ కాంగ్రెసు ఫిరాయింపులను ప్రోత్సహించి, ఓడించే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆరో అభ్యర్థిని రంగంలోకి దింపకూడదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాంటి స్థితి వస్తే పరువు పోతుందని, పరువు కాపాడుకోవాంటే సురక్షితంగా బయటపడే వ్యూహాన్ని మాత్రమే అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ అదనపు అభ్యర్థిని రంగంలోకి దింపుతాయా అనేది కూడా వేచి చూడాల్సిందే. తెలుగుదేశం తరఫున దాడి వీరభద్రరావు అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది. మరో రెండు సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో అభ్యర్థిని పోటీకి దింపే అవకాశాలు ప్రస్తుతం లేవని అంటున్నారు. కాంగ్రెసు నిర్ణయం వల్ల అన్ని పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఏ పార్టీకి ఆ పార్టీ సురక్షితంగా బయటపడాలనే ఎత్తుగడలోనే ఉందని, ఏ పార్టీ కూడా ముందుకు దూకి సాహసం చేయబోదని అంటున్నారు.












Click it and Unblock the Notifications