6రోజుల సిబిఐ కస్టడీకి గాలి: రవీంద్రనాథ్ కేసు వాయిదా

ఈ విషయమై విచారణ చేసేందుకు గాలి జనార్ధన్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు గాలిని సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఆరు రోజుల పాటు కర్నాటకలోని ఇనుప ఖనిజం తరలింపుపై సిబిఐ గాలి జనార్ధన్ రెడ్డిని విచారించనుంది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డిని గురువారం సాయంత్రం బెంగళూరుకు తరలించారు. ఈ రోజు ఉదయం అతనిని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. గాలితో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అలిఖాన్‌ను కూడా కోర్టులో హాజరుపర్చారు.
కాగా, బుధ, గురువారాలు గాలి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ న్యాయస్థానంలో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. సిబిఐ తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటూ బెయిలును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని గాలి జనార్ధన్ తరఫు న్యాయవాది సిబిఐ న్యాయస్థానానికి బుధవారం చెప్పారు.
అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాలను గుర్తించాలని చెబుతోందని, సరిహద్దులు తేలకుండా దీన్ని ఎలా నిర్దారిస్తుందని ప్రశ్నించారు. ఓఎంసి కేసులో నిందితుడైన గాలి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన సిబిఐ జడ్జి విచారణ చేపట్టినప్పుడు గాలి న్యాయవాది పైవిధంగా స్పందించారు.
ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షకంటే ఎక్కువకాలం గాలిని జైల్లో ఉంచాలని సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ సంస్థ దర్యాఫ్తులోనే లోపాలున్నాయని, కర్నాటకలోని కేసులను ప్రస్తావిస్తూ ఇక్కడ బెయిలును అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన లీజుల్లో తవ్వకాలే జరపలేదని సిబిఐ చెబుతోందని, అలాంటప్పుడు అక్రమ మైనింగుకు అవకాశం ఎక్కడిదని వాదించారు. గురువారం కూడా విచారణ కొనసాగింది.
రవీంద్రనాథ్ రెడ్డి కేసు 14కు వాయిదా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కేసు ఈ నెల 14కు వాయిదా పడింది. రవీంద్రనాథ్ రెడ్డికి నార్కో, లైడిక్షన్ టెస్టులు చేసేందుకు అనుమతించాలని కడప పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications