దమ్ము లేదు, హరీష్‌పైనే: సిఎం, అహంకారం: ఈటెల

తెలంగాణ వెనకబాటును రూపుమాపడానికి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని తాను పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. మాట సక్రమంగా రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో తాను ఎన్నో సార్లు తిరిగానని, పేదల ప్రజలకు సాయం చేయాలని పనిచేస్తున్నానని ఆయన అన్నారు. తమకు తెలంగాణ నుంచి 50 మంది శానససభ్యులున్నారని, తెరాసకు పది మంది మాత్రమే ఉన్నారని, తెలంగాణకు అసలైన ప్రతినిధులం తామేనని ఆయన అన్నారు. తనను తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని, తనను ఎవరూ భయపెట్టలేరని ఆయన అన్నారు.
తెలంగాణలో సాగునీటికి, మంచినీటికి నిధులు ఇస్తున్నామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాకు గుక్కెడు నీటిని ఇస్తే తప్పా అని ఆయన అడిగారు. చిత్తూరు ఆంధ్రప్రదేశ్‌లో లేదా అని ఆయన అడిగారు. ఏ ప్రాంతం పట్ల తనకు వివక్ష లేదని, పద్ధతి ప్రకారం చేస్తున్నానని, ఎక్కడెక్కడ ఏది అవసమో అది చేసుకుంటూ పోతున్నామని ఆయన అన్నారు. కాలర్ పట్టుకుని అడిగితే నిజామాబాద్ జిల్లాకు కాలేజీ ఇచ్చారనే వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు తాము అన్యాయం చేయబోమని ఆయన అన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమంతో పిల్లలకు చదువులు లేని పరిస్థితిని, ఉద్యోగాలు రాని పరిస్థితిని కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఏ ప్రాంతానికి ఎంత అవసరమో అంతే ఇస్తామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి వివరణకు ఈటెల రాజేందర్ స్పందిస్తూ - చిత్తూరు జిల్లాకు ఇవ్వకూడదని తాము అనడం లేదని, సమధర్మం పాటిస్తారా లేదా అనేది ప్రశ్న అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం వల్ల నష్టపోతున్నారని, మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడండని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ అహంకారం వల్లనే, వివక్ష వల్లనే తాము స్వయం పాలన కోరుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణలో మత కలహాలు సృష్టించింది మీరేనని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు 750 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నారని, మీరు సిఎం కాబట్టి ఇచ్చుకున్నారని, మీరు సిఎం కాబట్టి పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. తాను కాలర్ పట్టుకుంటానని అనలేదని, తెలంగాణ ఉద్యమం కాలర్ పట్టుకుంటే ఇచ్చారని అన్నానని ఆయన అన్నారు. అంతు చూస్తామనే పద్ధతిలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థులను, తెలంగాణను అవమానించే విధంగా సిఎం మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
హరీష్ రావుపై వ్యక్తిగతంగా మాత్రమే తాను అన్నానని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అన్నారు. తనను ఎంత బెదిరించడానికి ప్రయత్నిస్తే అంత గట్టిగా ఉంటానని ఆయన అన్నారు. భయపెడితే తాను లొంగబోనని అన్నారు. తాను హరీష్ రావు గురించి మాత్రమే మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications