ముద్రగడకు గవర్నర్ పదవి ఆఫర్ ? బయటపెట్టిన నాదెండ్ల..!
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada padmanabham) గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీలో చేరడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి ప్రచారం చేశారు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని చెప్పి, అన్నట్లుగానే పద్మనాభరెడ్డిగా కూడా అధికారికంగా పేరు మార్చుకున్నారు. అయితే అప్పట్లో పిఠాపురంలో పవన్ పోటీ సందర్భంగా జనసేన పార్టీ ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించిందని ఇవాళ ఆ పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వెల్లడించారు.
ఇవాళ కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో ఆయన దివంగత నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తావన తెచ్చారు. నిన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తను తెలుసుకున్న వెంటనే చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిపారు. ముద్రగడ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

మరోవైపు ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభాన్ని జనసేన పార్టీ తరపున కొందరు పెద్దలు సంప్రదించారని నాదెండ్ల తెలిపారు. అప్పట్లో ఆయన్ను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారన్నారు. అందరం కలిసి ప్రయాణం చేస్తే పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చర్చించారని గుర్తుచేసుకున్నారు. ఈ చర్చల్లో భాగంగానే, రాబోయే కూటమి ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభానికి గవర్నర్ పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పారని నాదెండ్ల వెల్లడించారు. ఆయన లాంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరమన్నారు.














Click it and Unblock the Notifications