ఎస్సీల సంక్షేమం కోసం కేంద్రమంత్రిని నిధులడిగిన మంత్రి లక్ష్మణ్.. ఏం జరిగిందంటే!
తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల నుంచి తక్షణమే రూ.150 కోట్ల విడుదలకు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై వినతిపత్రం ఇచ్చిన మంత్రి లక్ష్మణ్
షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల అభివృద్ధికి ప్రతిపాదించిన రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై వచ్చే నెలలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినతిపత్రాన్ని ఇచ్చారు.

అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని కేంద్రమంత్రిని కోరిన మంత్రి లక్షణ్
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, సంక్షేమ విద్యాసంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సమర్థ అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పరిపాలనకు కేంద్రబిందువుగా తీసుకుని షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్న మంత్రి
విద్యనే సామాజిక సాధికారతకు ప్రధాన ఆయుధంగా భావిస్తూ గురుకుల విద్యా వ్యవస్థ, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంక్షేమ విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల సంక్షేమ కార్యక్రమాల అమలుపై అదనపు ఆర్థిక భారం పడుతోందని మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని వినతిపత్రం
పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల సమగ్ర ఆధునీకరణ కోసం రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక నిధులతో విద్యార్థులకు మరింత సురక్షితమైన, ఆధునికమైన, నాణ్యమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యా ఫలితాలను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తొలి విడతగా రూ.150 కోట్లను తక్షణమే మంజూరు చేసేలా చర్యలు
మంత్రి సమర్పించిన వినతిపత్రంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సానుకూలంగా స్పందించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ కేంద్ర నిధుల్లో తొలి విడతగా రూ.150 కోట్లను తక్షణమే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, అలాగే రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రతిపాదనపై వచ్చే నెలలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications