ఢోకా లేదు, సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే..: చిరంజీవి

విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం పట్ల చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్లు, రిసార్టులలో మహిళలపై లైంగిక దాడుల ప్రభావం టూరిస్టుల పైన పడుతోందని చిరు అభిప్రాయపడ్డారు. విదేశీ మహిళా పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ విషయమై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యానని, పర్యాటకులకు రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పారు.
విదేశీ పర్యాటకుల రక్షణ కోసం తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులతో భేటీ అవుతామన్నారు. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో కేంద్రం పర్యాటక శాఖకు ఎక్కువ నిధులను కేటాయించిందని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ కోసం నిధులు కోరుతామన్నారు. చిరంజీవి షిండేతోను ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతోను భేటీ అయ్యారు.
కాగా, కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో స్విస్ వనితపై గ్యాంగ్ రేప్ ఉదంతంపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరు విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన మచ్చగా మారినట్లు ఆయన భావించారు.
సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే సంతోషిస్తా
బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే మంచిదేనని చిరంజీవి అన్నారు. ఆయనకు క్షమాభిక్ష పెడితే తాను సంతోషిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు అంతిమమైనా తాను క్షమాభిక్ష పెట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications