వారసత్వం: వైయస్‌తో కాంగ్రెసు, ఎన్టీఆర్‌తో టిడిపి

NTR - YSR
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలకు తామే వారసులమని చెప్పుకుంటూ కాంగ్రెసు కార్యకర్తల్లోనే కాకుండా నాయకుల్లో కూడా అయోమయం సృష్టించినట్లుగానే ఎన్టీ రామారావు ఫ్లెక్సీలను వాడుకుంటూ తెలుగుదేశం పార్టీలో కూడా అదే రకమైన అయోమయం, గందరగోళం సృష్టించాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. తన ఫ్లెక్సీల్లో తన ఫొటోలను వాడుకోవడంపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం పాటించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఓ అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫొటోలను కూడా వాడుకోవడానికి సిద్ధపడ్డారని అనుకోవచ్చు.

ఎన్టీ రామారావు ఫొటోలను ఫ్లెక్సీల్లో వాడుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ గందరగోళానికి గురవుతున్న సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీ రామారావు ఫొటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి ముద్గుకృష్ణమ నాయుడు, రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వారు మండిపడినంత మాత్రాన వెనక్కి తగ్గే తత్వం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులది కాదు. వైయస్ ఫొటోల విషయంలో కాంగ్రెసు నాయకులు ఎంతగా మొత్తుకున్నా వారు వెనక్కి తగ్గలేదు.

రాజశేఖర రెడ్డిపై వచ్చిన ఆరోపణలను పక్కన పెడితే ఎన్టీ రామారావు తర్వాత ప్రజల్లో అత్యంత ఆదరణ గల నాయకుడు ఆయనే. ప్రజాభిమానంలో వీరికి దీటైన నాయకులు రాష్ట్రంలో లేరు. అందువల్ల ప్రజాదరణ గల ఇద్దరు నాయకులను వాడుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందనేది స్పష్టం.

తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత వారసత్వ పోరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. మరోవైపు, ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి వైయస్ జగన్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని ఆమె చాలా కాలంగా అంటూ వస్తున్నారు. తన తాత ఎన్టీ రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆరాటపడుతున్నారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు పేరును వాడుకునే హక్కు లేదనే దాకా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెళ్లే అవకాశాలున్నాయి.

ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత చంద్రబాబుదేనని, అలాగే, ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అందువల్ల ఎన్టీ రామారావు పేరును వాడుకునే హక్కు చంద్రబాబుకు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పటికే అంటున్నారు. ఫ్లెక్సీల వివాదం ముందుకు రాక మునుపు నుంచే వైయస్ జగన్, వైయస్ విజయమ్మ ఎన్టీ రామారావును ప్రశంసించిన సందర్భాలున్నాయి. వైయస్ విగ్రహం పక్కనే ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించిన సంఘటన కూడా జరిగింది.

పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావుకు అభిమానులు ఉన్నారు. ఇతర పార్టీల్లోని చాలా మంది నాయకులు ఎన్టీ రామారావు అభిమానులు కూడా. దీన్నే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అస్త్రంగా వాడుకోనుంది. వైయస్, ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం శ్రమించారని, పేద ప్రజల అభ్యున్నతికే పాల్పడ్డారని, వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు కాంగ్రెసు పార్టీ తూట్లు పొడిచిందని, ఎన్టీరామారావు పథకాలకు చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాదిస్తున్నారు.

వివాదం ముదురుతున్న కొద్దీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబునాయుడిపై సంధించడానికి మరిన్ని అస్త్రాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బయటకు తీసే అవకాశం ఉంది. తనను గద్దె దించిన సమయంలో ఎన్టీ రామారావు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను కూడా కంఠోపాఠంగా అప్పగించడానికి వారు వెనకాడకపోవచ్చు. మొత్తం మీద, వైయస్ పేరుతో కాంగ్రెసు పార్టీని గందరగోళంలో పడేసినట్లే, ఎన్టీ రామరావు పేరుతో తెలుగుదేశం పార్టీని అయోమయంలో పడేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధపడిందనేది నిస్సందేహం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+