హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టగ్గాఫ్ వార్: జూ. ఎన్టీఆర్ నిప్పు, సింహా బాలకృష్ణ కసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నిప్పు పెట్టారు. విజయవాడ పర్యటన చేయడం ద్వారా తన సత్తాను చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన బొమ్మలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడంపై నోరు విప్పకపోవడం ద్వారా నిప్పు పెట్టారు. దీంతో బాబాయ్ బాలకృష్ణ తీవ్రంగానే మండిపడుతున్నట్లు కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై ఆయన కసి పెంచుకున్నట్లు అనిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్‌ ఎన్టీఆర్‌కు హెచ్చరికలు చేయడం ద్వారా బాలకృష్ణ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లేనని అంటున్నారు. ఫ్లెక్సీల వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్యలను ఖండించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను వదులుకోవడానికే సిద్ధపడినట్లు భావిస్తున్నారు. పైగా, జూనియర్ ఎన్టీఆర్‌పై పోరును తీవ్రం చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఫ్లెక్సీల్లో తన ఫొటోలను వాడుకోవడాన్ని ఖండించకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెగించి సీనియర్ ఎన్టీ రామారావు బొమ్మలను కూడా వాడుకుంటున్నారని, జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని బాలకృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి రాకపోతే జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీతో ఏ విధమైన సంబంధం లేదని బాలకృష్ణ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

జూనియర్ ఏం చేస్తారు..

బాలకృష్ణ హెచ్చరికల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎటు వైపు అడుగులు వేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. తనపై బాలకృష్ణ తీవ్రమైన ప్రకటన చేసే దాకా నిరీక్షిస్తారా, ఈ లోపల తన ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తారా అనేది తెలియడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా హరికృష్ణ కూడా ఈ వ్యవహారంపై మాట్లాడడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను సరే, తన తండ్రి ఎన్టీ రామారావు బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడంపై కూడా హరికృష్ణ మాట్లాడడం లేదు.

జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణల మౌనం రాజకీయంగా వారు ఏం చేస్తారనే ప్రశ్నను వేయిస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణలను ఎదుర్కోవడానికే వారు సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే, ఏ విధంగా వారు పోరాటం సాగిస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికిప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపించి, 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.

జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నిర్ణయం

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తాను జోక్యం చేసుకోకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని బాలకృష్ణకే వదిలేసినట్లు చెబుతున్నారు. పైగా, కృష్ణా జిల్లా వ్యవహారాలను కూడా బాలకృష్ణకే అప్పగించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఏర్పడిన అయోమయాన్ని బాలకృష్ణ ఏ విధంగా తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటానని ప్రకటించారని వారంటున్నారు. పార్టీ శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి తాజాగా శనివారం అదే విషయం చెప్పారు. అయోమయం సృష్టించడానికి మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇదే విధమైన వ్యాఖ్యలు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి తదితరులు చేశారు.

వ్యవహారం ఆషామాషీగా లేదు..

తెలుగుదేశం పార్టీ శానససభ్యులు, నాయకులు చెబుతున్నంత సరళంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం లేదని తెలుస్తోంది. బాద్‌షా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఆయన మంచి ఊపు మీద ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లోనూ ఆయన కొత్త కాంబినేషన్లను వెతక్కుంటున్నారనే మాట వినిపిస్తోంది.

నిజానికి, జూనియర్ ఎన్టీఆర్ తెలుగు యువత పగ్గాలు చేతుల్లోకి తీసుకోవాలని అనుకున్నారు. అందుకే, పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో మహానాడు వేదిక నుంచి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు యువత పగ్గాలు చేతికి వస్తాయని ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నట్లు ఆ తర్వాతి పరిణామాలు తెలియజేశాయి.

తన కుమారుడు నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించే వ్యూహంలో భాగంగా చంద్రబాబు రాజకీయాలు నడుపుతూ వచ్చారు. నారా లోకేష్‌కు తెలుగు యువత నాయకత్వాన్ని అప్పగించడం ద్వారా దానికి ప్రాతిపదిక ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. దీంతో తనకు తెలుగు యువత నాయకత్వం కల్లేనని ఎన్టీఆర్ భావించారు. దాంతో ఆయన పార్టీకి దూరమవుతూ పార్టీలో అంతర్గత పోరుకు తెర తీసినట్లు భావిస్తున్నారు.

వైయస్ జగన్‌కు మద్దతిస్తారా..

జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారనే దాకా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వార్తాకథనాలు కూడా వస్తున్నాయి. అయినా, జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోనట్లే వ్యవహరిస్తున్నారు. అయితే, వైయస్ జగన్‌కు ఇప్పటికే ఆయన పరోక్షంగా సహకరిస్తున్నట్లు బలమైన సంకేతాలు వస్తున్నాయి. గుడివాడ శానససభ్యుడు వైయస్సార్ కాంగ్రెసులో చేరడం, తాజాగా వల్లభనేని వంశీ చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేయడం అందుకు సంకేతాలని అంటున్నారు. కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటిస్తారా అనే నిర్ధారణకు రావడం తొందరపాటే అవుతుంది.

అయితే, రాజకీయ ఆకాంక్షలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్నాయని, దానికి హరికృష్ణ మద్దతు ఉందని మాత్రం కచ్చితంగానే చెప్పవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి నెంబర్ టూగా ఉండడానికి ఆయన ఇష్టపడరదని చెప్పవచ్చు. నెంబర్ వన్‌గానే ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు. అందుకు 2019 ఎన్నికలను ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

మొత్తం మీద, తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే పరిస్థితిని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తెచ్చి పెట్టారు. వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. ఈ గందరగోళాన్ని కొనసాగించాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారా, దీనికి బాలకృష్ణ మాత్రమే తెర వేస్తారా అనేది వేచి చూడాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ నిబద్ధత విషయంలో స్పష్టమైన ప్రకటన చేసినా, జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ప్రకటన చేసినా స్పష్టత వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేం.

English summary
The fight with Balakrishna within the Telugudesam party has been started by Jr NTR. Nandamuri hero and Telugudesam leader N Balakrishna warned Jr NTR on flexees row. He said that Jr NTR should condemn the act of YSR Congress regarding his photo, otherwise he has to face serious consequences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X