వైయస్ జగన్ గజనీ, 36 కంపెనీలతో దోచాడు: ఈడి

నేరుగా లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద దొరికిపోతాడు కాబట్టే 36 కంపెనీలను సృష్టించి ముడుపులకు పెట్టుబడుల రూపం ఇచ్చారని తెలిపింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టినవారంతా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినవారేనని, లంచాలను షేర్ల కొనుగోలుకు చెల్లించారని ఈడీ తరఫు న్యాయవాది ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ ముందు వాదించారు.
ఈ క్విడ్ ప్రొ కో వ్యవహారం పైకి వ్యాపారంగా కనిపిస్తున్నాఇది పక్కా అవినీతి అని, కాబట్టే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని, ఇప్పుడు ఆ విచారణ కొనసాగుతోందని వివరించారు. జగన్ అక్రమాస్తుల కేసులో జనవరి 8వ తేదీనాటి రూ.143.74 కోట్ల విలువైన ఆస్తుల జప్తుపై ఈడీ న్యాయ న్యాయ ప్రాధికార సంస్థ సభ్యులు పి.కె.శర్మ, రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం తుది వాదనలు జరిగాయి.
గతంలో జగతి పబ్లికేషన్స్, రామ్‌కీ ఫార్మా సిటీ సంస్థల తరఫు లాయర్లు చేసిన వాదనలను ఈడీ లాయర్ విపుల్ కుమార్ గట్టిగా తిప్పికొట్టారు. తండ్రి అధికారంలోకి రాగానే జగన్ అనూహ్యంగా సంపద కూడగట్టా రని, ప్రభుత్వ భూ కేటాయింపులు, కాంట్రాక్టులు, సెజ్‌లు, రియల్ ఎస్టేట్ అనుమతులు, మైనింగ్ తవ్వకాల అనుమతులలో అవినీతికి పాల్పడ్డారని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడినందునే ఆయనను గజనీతో పోల్చాననిని వివరించారు.
వైయస్ అధికారం చేపట్టే నాటికి రూ.లక్షల్లో ఉన్న జగన్ సంపాదన వైఎస్ చనిపోయే నాటికి వందల కోట్లకు చేరిందని చెప్పారు. వైఎస్ అధికారంలోకి రాకముందు వారి కుటుంబానికి భారీగా ఆదాయం ఆర్జించగల వనరులేవీ లేవని, వారి ఐటీ రిటర్న్స్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని విపుల్ చెప్పారు. 36కు పైగా కంపెనీలను ప్రారంభించిన జగన్ అవినీతి సొమ్మును పెట్టుబడుల రూపంలో మళ్లించారని చెప్పారు. జగతి పబ్లికేషన్స్‌లోకి కూడా ఇదే తరహాలో నిధులను రాబట్టారని తెలిపారు.
అసలు కార్యకలాపాలే ప్రారంభించని కంపెనీకి చెందిన రూ.10 విలువ గల షేరును రూ.350 చొప్పున ఎవరైనా కొంటారా అని, రూ.349 కోట్ల మేర ఆస్తులున్న కంపెనీలో రూ.1246 కోట్ల మేర పెట్టుబడులు ఎలా పెడతారు? అని ఆయన ప్రశ్నించారు. టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రా, ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు జగతి పబ్లికేషన్స్‌లో రూ.2 కోట్లు, రూ.8 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాయని, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకే రామ్‌కీ ఈ సంస్థలను సృష్టించిందని విపుల్ కుమార్ చెప్పారు.
జగతిలో పెట్టుబడులు పెట్టకముందు కానీ, పెట్టిన తర్వాత కానీ ఆ రెండు కంపెనీల బ్యాంకు ఖాతాలు పెద్దగా వినియోగించలేదని, నగదు కార్యకలాపాలు జరగలేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు ఈ కంపెనీలు సమాధానం ఇవ్వలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications