వేటుకు రెడీ: స్పీకర్‌తో వైయస్ జగన్ వర్గ ఎమ్మెల్యేలు

తాము పార్టీ విప్‌లు ధిక్కరించి, ఓటు వేశామని వారు స్పీకర్ వద్ద అంగీకరించారు. తమపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని పేర్ని నాని మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమపై వేటు వేసినా తాము కట్టుబడి ఉంటామని, వేటు వేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. తాము చెప్పిన మాటలకు స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. తమపై వేటు వేసిన ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, ప్రజలను మోసం చేసింది కాబట్టి తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి ప్రజావిశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని స్పీకర్‌కు చెప్పినట్లు పేర్ని నాని తెలిపారు. ఉప ఎన్నికలు రాకుండా చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని, తమపై చర్యల్లో జాప్యం చేస్తోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఏ విధమైన విప్ అందలేదని తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. జీవితాంతం తాను కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యుపిఎకు మద్దతు ఇస్తానని చెప్పడంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.
తాను పార్టీకీ శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని, వాటిని ఆమోదించకుండా విప్ ధిక్కరించావంటూ తనపై ఫిర్యాదు చేయడం సరి కాదని కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యుడు మద్దాల రాజేష్ అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications