జగన్‌తో పొత్తు: కెవిపి రాయబారం బెడిసికొట్టిందా?

KVP Ramachandar Rao
హైదరాబాద్: జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఎన్నికలకు ముందు పొత్తు లేదా పార్టీ విలీనం అనే ప్రతిపాదన విషయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాయబారం బెడిసికొట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి జగన్‌ను అడ్డం పెట్టినట్లు కాంగ్రెసు తెలంగాణ నాయకులు పలువురు కెవిపిపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసులో విలీనం చేయిస్తానని కెవిపి రామచందర్ రావు అధిష్టానానికి హామీ ఇచ్చిన తర్వాతనే తెలంగాణపై ప్రకటన ఆగిపోయిదని అంటున్నారు.

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై ప్రకటనకు గడువు పెట్టి, ఆ గడువును పాటించకపోవడానికి కెవిపి రాయబారమే కారణమని అంటున్నారు. తెలంగాణపై ప్రకటన వెలువడుతుందనే సమయంలో సీమాంధ్ర నాయకులకు కెవిపి రామచందర్ రావు నాయకత్వం వహించి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని అన్నారు. కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేయించడానికి కెవిపి రామచందర్ రావు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు.

ఎన్నికలకు ముందు పొత్తుకు గానీ పార్టీ విలీనానికి గానీ వైయస్ జగన్ అంగీకరించలేదని అంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే తాను యుపిఎకు మద్దతు ఇస్తానని జగన్ తన పాత మాటనే మరోసారి చెప్పినట్లు సమాచారం. అయితే, ఫలితాలు వెలువడిన తర్వాత ఇచ్చే మద్దతుపై ఆధారపడలేమని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో స్నేహం గానీ, విలీనం గానీ ఎన్నికలకు ముందు సాధ్యం కాదని భావించిన అధిష్టానం తెలంగాణపై తీవ్రంగానే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఎన్నికలకు ముందు ప్రకటన వెలువడుతుందని, జగన్‌తో స్నేహం సాధ్యం కాకపోవడంతో ఆ దిశగా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోందని ఓ మంత్రి తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. రెండు ప్రాంతాల్లో నష్టపోవడం కన్నా తెలంగాణ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలోనైనా నిలదొక్కుకుందామనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాత్రం కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను తన వైపు తిప్పుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు సిద్ధంగా లేదని ఆయన గట్టిగానే నమ్ముతున్నారు. నిజానికి, తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ విశ్వసించడం లేదు. కానీ, అందుకు విరుద్ధంగా కాంగ్రెసు అధిష్టానం కదులుతుందనే ఓ అభిప్రాయం వినిపిస్తోంది.

తెరాసలోకి దూకేద్దామని భావించిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానం సూచన మేరకే వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణపై అధిష్టానం నిర్ణయం వెలువరిస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. అయితే, ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణపై పార్టీ అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+