ఫొటోలు: వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే తారలు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎన్నికల గోదాలోకి దిగడానికి పలువురు తెలుగు సినీ నటీనటులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని తెలుగుదేశం నాయకుడు, నందమూరి హీరో బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అన్ని పార్టీల్లోనూ సినీ నటీనటులు సందడి చేస్తున్నారు. కాంగ్రెసుకు చిరంజీవే పెద్ద దిక్కు. చిరంజీవి సినీ గ్లామర్‌తో కాంగ్రెసు గట్టెక్కే ప్రయత్నాలు కూడా చేయవచ్చు.
చిరంజీవి ఉన్నప్పటికీ అధికార పక్షం కాంగ్రెస్‌లోనే సంఖ్య తక్కువగా ఉంది. కాంగ్రెస్‌లో ఉన్న నటి జయసుధ పార్టీ వీడి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పలువురు తారలు టికెట్‌లు ఆశిస్తున్నారు. జయప్రద, జయసుధ, కవిత, మురళీమోహన్, నరేష్, గీతాంజలి వంటి పలువురు పాతతరం నటులు ఈసారి వివిధ పార్టీల తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
జయప్రద త్వరలోనే వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరి రాజమండ్రి నుంచి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టిడిపి నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నటుడు మురళీమోహన్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుస్తుగానే సేవా కార్యక్రమాల ద్వారా ప్రచారం ప్రారంభించారు. ఈసారి జయప్రద, మురళీ మోహన్ ఇద్దరు సినిమా ప్రముఖుల మధ్య పోటీ తప్పదు.
టిడిపిని స్థాపించింది సినిమా నటుడే అయినా, ఎన్టీఆర్ హయాంలో కన్నా సినిమా నటీనటులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఎక్కువగా కనిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎన్టీఆర్ భవన్ సినిమా తారలతో కళకళ లాడేది. ప్రధానంగా 2004 ఎన్నికల సమయంలో మొత్తం తెలుగు సినిమా రంగం టిడిపి విజయానికి ప్రచారంలోకి దిగింది. ఆ సమయంలో కాంగ్రెస్‌లో వాణిశ్రీ, ధర్మవరపు సుబ్రమణ్యం మాత్రమే ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత వాణిశ్రీ రాజకీయాల్లో కనిపించలేదు. ధర్మవరపు సుబ్రమణ్యం మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్‌లో ఉండి, తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ వైపు వెళ్లారు. ఈసారి టిడిపి నుంచి టికెట్లు ఆశిస్తున్న నటుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కవిత, గీతాంజలి, ఎవిఎస్ గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించారు.
గత కాలం నటి లత ఇంతకు ముందు ఓసారి టిడిపి టికెట్ ఆశించి, ఎన్టీఆర్ భవన్‌కు పలుమార్లు వచ్చారు. లవకుశ సినిమా కాలం నాటి నటి గీతాంజలి 2009 ఎన్నికల తరువాత టిడిపి కార్యక్రమాల్లో కనిపించలేదు. ఎవిఎస్ మాత్రం ఈసారి టికెట్ లభిస్తుందనే ఆశతో ఉన్నారు. తెలుగు మహిళ అధ్యక్ష పదవి ఆశించిన కవిత సైతం పార్టీ టికెట్ లభిస్తుందని ఆశిస్తున్నారు. తరుచుగా పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు.
సినీ నటుడు నరేష్ గతంలో బిజెపి తరఫున పోటీ చేశారు. ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున మెదక్ నుంచి పార్లమెంట్‌కు గెలిచారు. టిఆర్‌ఎస్‌లో ఉన్న ఏకైక నటి విజయశాంతే. ఈసారి మెదక్‌కు బదులు మరేదైనా నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన బాబు మోహన్ సిద్ధిపేట ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి ఘోరంగా ఓడిపోయిన తరువాత టిడిపి కార్యక్రమాల్లో కనిపించడం లేదు. బిజెపి తరఫున ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన కోట శ్రీనివాసరావు ఆ తరువాత రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. గతంలో టిడిపి తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన రోజా ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారు.

చిరంజీవి కాంగ్రెసు పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనేది తేలడం లేదు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రచారానికి మాత్రమే పరిమితం కావచ్చు.

రెండు సార్లు ఓడిపోయిన సినీ నటుడు మురళీ మోహన్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి లోకసభ సీటు నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన జయప్రదను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మూడోసారైనా ఆయన గెలుస్తారా..

వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలనే పట్టుదలతో బాలకృష్ణ ఉన్నారు. ఆయన కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

రోజు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున శానససభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.

జయప్రద రాజమండ్రి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల నుంచి ఆమె తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ గత ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆమె భవిష్యత్తు ఎలా ఉందో చెప్పలేని స్థితి. తిరిగి కాంగ్రెసు నుంచి పోటీ చేస్తారా, సమయానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా, రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది తేలడం లేదు.

విజయశాంతి గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తేలడం లేదు. పోటీ చేయడం మాత్రం ఖాయమని కెసిఆర్ మాటలను బట్టి తెలుస్తోంది.

మరో సినీ నటి కవిత తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చెప్పలేం

గతంలో బిజెపిలో ఉన్న సినీ నటుడు నరేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications