గాలికి షాక్: బ్రాహ్మణి స్టీల్స్ భూకేటాయింపు రద్దు

brahmani steels
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌కు భూమిని కేటాయిస్తూ జారీ అయిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10,760 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం విషయంలో నిబంధనలను పాటించకపోవడంతో భూకేటాయింపు జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. సకాలంలో బ్రాహ్మణి స్టీల్స్ పూర్తి కాలేదు. ఈ కర్మాగారానికి ఉపయోగించుకునేందుకు కేటాయించిన ఓబుళాపురం గనుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణ కూడా ఉంది.

కడప జిల్లా జమ్మలమడుగులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌కు భూమిని కేటాయించింది. విమానాశ్రయం ఏర్పాటు వంటివాటికి కూడా ప్రభుత్వం భూమి కేటాయించింది. బ్రాహ్మణి స్టీల్స్‌కు సంబంధించి కొన్ని పనులు మాత్రం జరిగాయి. దీంతో అక్కడ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఆసక్తిని ప్రదర్సిస్తున్నాయి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి కేటాయించిన గనులను తమకు కేటాయిస్తే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగే అవకాశాలున్నాయి.

కడప జిల్లా జమ్మలమడుగు వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బ్రహ్మణి ఇండస్ట్రీస్‌తో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో 2007 మే 21న పరిశ్రమల శాఖ ఒప్పందం చేసుకుంది. 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని, 2017 నాటికి తమ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుతుందని బ్రాహ్మణి అప్పట్లో తెలిపింది. ఈ ప్లాంటుద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది. ప్రతిపాదిత యూనిట్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు కోరింది.

ఈ ప్రతిపాదనలను 2007 మే 21న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) భేటీలో ఆమోదించగా ప్రభుత్వం జీవో 477 జారీచేసింది. తర్వాత ప్రాజెక్టుకు 10,760.66 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఎకరా రూ.18 వేల చొప్పున ఈ భూ కేటాయింపులు చేశారు. అలాగే జమ్మలమడుగు మండలం అంబవరంవద్ద వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటుకు మరో 3115 ఎకరాలు కేటాయించింది. ఈ భూమి ధరను ఎకరా రూ.25వేలుగా నిర్ణయించింది.

బ్రహ్మణి స్టీల్స్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2005-10 పారిశ్రామిక విధానం ప్రకారం బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ, ఇతర అనుమతులు పొందడానికి బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు సహకరించాలని తీర్మానించింది. వాస్తవానికి, ఒప్పందం ప్రకారం 2009 నాటికి 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో తొలిదశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ప్రాజెక్టు పనులు పూర్తిగా ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు.

స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన 10760 ఎకరాల భూములను యాక్సిస్ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.350కోట్ల రుణం పొందింది. దీనిపై కడప జిల్లా కలెక్టర్ జమ్మలమడుగు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు ఇన్‌చార్జి పి.రంగారెడ్డిపై 2012 మార్చి 22న చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు పరిశ్రమల శాఖ పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒప్పందాన్ని, భూ కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది.

దీంతో తమ మాతృ సంస్థ అయిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కార్యకలాపాలను నిలిపివేశారని, అందుకే తాము స్టీల్ ప్లాంట్ పనులను నిలిపి వేశామని 2011 మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మణి ఇండస్ట్రీస్ లేఖ రాసింది. స్టీల్ ప్లాంట్‌పై తాము ఇప్పటివరకు రూ.1350 కోట్ల పెట్టుబడి పెట్టామని, తొలి దశ ప్రాజెక్టుకు అమలుకు సంబంధించి పలు పనులు పూర్తి చేశామని తెలిపింది. ఓఎంసీ ద్వారా వచ్చిన సొంత నిధులనే ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టామని, ఓఎంసీపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కూడా ప్రాజెక్టు అమలు చేయకపోవడానికి కారణమని వివరించింది.

గండికోట రిజర్వాయరు నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ప్రభుత్వ షోకాజ్ నోటీసుకు స్పందనగా బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఇచ్చిన సుదీర్ఘ సమాధానాన్ని ప్రభుత్వం న్యాయ శాఖ పరిశీలనకు పంపింది. పరిశ్రమల శాఖ దీనిపై రెవెన్యూ, సాగునీటి శాఖల అభిప్రాయాలు తీసుకుంది. కడప జిల్లా కలెక్టర్ బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు కేటాయించిన భూమిని పరిశీలించి భూ వినియోగ వివరాలను అందజేశారు. ప్లాంటుపై రూ.1350 కోట్లు ఖర్చు చేశామని బ్రహ్మణి ఇండస్ట్రీస్ చెబుతుండగా, అక్కడ కేవలం రూ.171 కోట్లు ఖర్చు చేసి ఉంటారని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, ఆర్అండ్‌బీ ఇంజనీర్లు తేల్చారు. ప్రాజెక్టు అమలు, ఉపాధి కల్పనతోపాటు అన్ని విధాలుగా బ్రహ్మణి ఇండస్ట్రీస్ విఫలం కావడంతో చర్యలకు న్యాయశాఖ సిఫారసు చేసింది. ప్రాజెక్టు అమల్లో విఫలమైనందుకు బ్రహ్మణితో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+