విదర్భపై కన్నేసిన శరద్ పవార్: టిజెఎసిలో ఎన్సీపి

ప్రత్యేక తెలగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను శరద్ పవార్ ఇప్పటికే సమర్థించారు. టిజెఎసిలో చేరడం ద్వారా మరో అడుగు ముందుకేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భను చర్చనీయాంశం చేయడానికి శరద్ పవార్ సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
టిజెఎసి చైర్మన్ కోదండరామ్, ఇతర నాయకులతో ఎన్సీపి ప్రధాన కార్యదర్శి డిపి త్రిపాఠి సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ జెఎసిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, న్యూడెమొక్రసీ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్సిపీ కూడా చేరడంతో తెలంగాణ జెఎసి బలం పెరిగినట్లే. దాంతో దేశ రాజధానిలో తెలంగాణ నినాదం మరింత బలంగా వినిపించే అవకాశం ఏర్పడింది.
కాగా, తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. తెలంగాణ రాజకీయ జెఎసి ధర్నాకు బిజెపి పూర్తి మద్దతు ప్రకటించింది. మంగళవారం ఉమా భారతి తెలంగాణ జెఎసి నాయకుల దీక్షా శిబిరాని వచ్చి తన మద్దతు ప్రకటించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా దీక్షా స్థలికి వచ్చి మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications