జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: ఘాటైన వ్యాఖ్యలు

జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దన్న సిబిఐ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ కోర్టును కోరింది. మరో ఐదు ఛార్జీషీట్లు దాఖలు చేయాల్సి ఉందని తెలిపింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్‌కు బెయిల్ నిరాకరించింది. అంతకుముందే ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో పాటు ఆడిటర్ విజయ సాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
సుప్రీం కీలక వ్యాఖ్యలు
బెయిల్ తీర్పు సమయంలో సుప్రీం కోర్టు ఘాటైన కీలక వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా దేశంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
జగన్ బెయిల్ పిటిషన్ తీర్పు నేపథ్యంలో ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జూపూడి ప్రభాకర రావు, మాజీ మంత్రి మారెప్ప తదితరులు సుప్రీం కోర్టుకు వచ్చారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయానికి, జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ బెయిల్ పైన తీర్పు వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ ఉత్కంఠగా ఎదురు చూసింది.
సిబిఐకి గడువు
జగన్ ఆస్తుల కేసులో తుది ఛార్జీషీటును దాఖలు చేసేందుకు సిబిఐకి సుప్రీం కోర్టు మరో నాలుగు నెలల గడువు ఇచ్చిందని సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ బాన్ తెలిపారు. విజయ సాయి రెడ్డి కూతురు వివాహం ఉన్నందున జూన్ 5న లొంగిపోవాలని ఆయనను ఆదేశించిందన్నారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని నిమ్మగడ్డకు చెప్పిందన్నారు. ఆర్థిక నేరాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టు అభిప్రాయపడిందన్నారు. కాగా, తుది ఛార్జీషీటు కోసం సిబిఐకి నాలుగు నెలలు గడువివవ్వడంతో జగన్ అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.












Click it and Unblock the Notifications