ఎంసెట్ మాల్ ప్రాక్టీస్: గురివిరెడ్డి సహా పలువురి అరెస్టు

మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో బ్రహ్మమూర్తి నాయుడు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలో పలు మాస్ కాపీయింగ్ సంఘటనల్లో గురివిరెడ్డి ముఠా పట్టుబడింది. అత్యాధునిక పరికరాల సహాయంతో కాపీయింగ్‌కు పాల్పడడంలో గురివిరెడ్డిది అందె వేసిన చేయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా గురివిరెడ్డి ముఠా నెట్ వరక్ నడిపింది.
కాగా, విజయవాడలోని ఓ కార్పోరేట్ కాలేజీలో విద్యార్థుల పేరు మీద పరీక్ష రాయడానికి ప్రయత్నించిన ఏడుగురు అధ్యాపకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతారని అనుమానించిన 10 - 15 మంది రాలేదు. నిఘా సంస్థ సమాచారంతో పోలీసులు దాడులు చేసి మాల్ ప్రాక్టీస్‌కు ప్రయత్నించినవారిని అరెస్టు చేశారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్ష జరిగింది. వైద్య విద్య, వెటర్నరీ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష యేటా జరుగుతుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి 2 లక్షల 77 వేల మంది పరీక్ష రాశారు. వైద్య విద్య, వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశానికి లక్షా నాలుగు వేల మంది పరీక్ష రాశారు.
వైద్య విద్యలో ప్రవేశానికి పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 190 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు.












Click it and Unblock the Notifications