శిథిలాల కింద 16 రోజులు సజీవంగా మహిళ
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూలిన భవనం శిథిలాల కింద గత 16 రోజుల పాటు ఓ మహిళ బతికే ఉండడం. ఈ సంఘటన ఆశ్చర్యం గొలుపుతోంది. రేష్మ అనే మహిళ భవనం రెండో అంతస్థులోని శిథిలాల కింద కూరుకుపోయిందని ఫైర్ సర్వీసెస్ వర్గాలు చెప్పాయి. ఏప్రిల్ 24వ తేదీన ఢాకా శివారులో 8 అంతస్థుల భవనం కుప్పకూలింది.
మహిళకు ఏ విధమైన గాయాలు కూడా తగలలేదని సమాచారం. ఈ భవనం కూలి ఘటనలో వేయి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గురువారంనాడు 55 శవాలను వెలికి తీశారు. భారతదేశంలో 1984లో భోపాల్ గ్యాస్ ప్రమాదం తర్వాత అంతటి ప్రమాదం దక్షిణాసియాలో జరగడం ఇదే మొదటిసారి.

మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. శిథిలాలను తొలగించే పని ఇంకా కొనసాగుతోంది. శిథిలాల తొలగించడానికి భారీ యంత్రాలను వాడుతున్నారు. భవనంలో దుస్తుల కర్మాగారం ఒకటి ఉండేది. భవనం బీటలు వారినా పట్టించుకోకుండా అలాగే పనిచేయిస్తూ వెళ్లారు.
శిథిలాల కింది నుంచి మహిళ అరుపులు విన్న సైనికాధికారులు శిథిలాలను తొలగించే పని ఆపాలని ఆదేశించారు. మహిళను సురక్షితంగా బయటకు తీయడానికి వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఆమెను మిలిటరీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications