దాసరికి పగ్గాలు: కాపునాడుతో చిరంజీవి పోరుకు సై

చిరంజీవిని ఎదుర్కోవడానికి దాసరి నారాయణ రావు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. కాపు సామాజిక వర్గాన్ని దాసరి నారాయణ రావు చీల్చే అవకాశాలున్నట్లు భావించారు. అయితే, కోల్ గేట్ స్కామ్‌లో చిక్కుకున్న దాసరి నారాయణ రావు దూకుడుకు కళ్లెం పడినట్లేనని భావిస్తున్నారు. దాంతో చిరంజీవి కాపునాడు సహకారంతో ముందుకు దూకడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాపునాడు మంగళవారం విజయవాడ పాతబస్తీలో సమావేశమై రాజకీయాలపై చర్చించింది.
కాపునాడు సాధారణంగా కాంగ్రెసుకు మద్దతుగా నిలుస్తుంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని అది కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాపునాడు నిర్ణయించినట్లు సమాచారం. ఈ సభకు చిరంజీవిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. తద్వారా చిరంజీవి రాష్ట్రంలో తన ప్రచార పర్వానికి ఊపునిస్తారని అంటున్నారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు రావచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు బత్స సత్యనారాయణ, చిరంజీవి ద్వారా కోస్తాంధ్రలోని కాపు సామాజిక వర్గాన్ని తనవైపు కూడగట్టుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం చిరంజీవితో కలిసి పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు సమాచారం.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తున్న కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపు తెచ్చుకునే వ్యూహంలో భాగంగానే ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. కావూరి సాంబశివ రావుతో పాటు కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అందుకు పనికి వస్తారని అనుకుంటున్నారు. కావూరికి కేబినెట్ హోదాతో మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు సిడబ్య్లూసిలో శాశ్వాత ఆహ్వానితుడిగా నియమించడం ద్వారా కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను కాంగ్రెసు అధిష్టానం పంపినట్లయింది. ఇందుకు అనుగుణంగానే కావూరి సాంబశివ రావు ఆ వర్గాన్ని కూడగట్టేందుకు శాయశక్తులా పనిచేసే అవకాశాలున్నాయి.
జెడి శీలం ద్వారా దళిత క్రిస్టియన్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మరో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ద్వారా దళితులను పార్టీ వైపు నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో మాదిగ సామాజిక వర్గం మద్దతు పొందేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగను ఇందులో భాగంగానే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కలిశారని అంటున్నారు.
ఇక, తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంత వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ కాంగ్రెసు నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు సమాచారం. రాయలసీమ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వదిలివేసి, ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ చేజారకుండా కాంగ్రెసు అధిష్టానం పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications