విజయమ్మ పర్యటన: తెలంగాణలో జగన్ ప్రభావమెంత?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర పైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఈ కారణంగా తెలంగాణలోని పార్టీ నేతలు నిరాశలో మునిగిపోయినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతం నుండి మాజీ మంత్రి కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గోనె ప్రకాశ్ రావు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ఉన్నప్పటికీ ఆ ప్రభావం కనిపించడం లేదని అంటున్నారు. అధిష్టానం కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదని, అందువల్ల తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలోపేతం కావడం లేదంటున్నారు.
రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత బోడ జనార్ధన్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ స్థాపించి మూడేళ్లైనా తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించలేదని, వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుకు సిద్ధమైందని, అందుకే బలోపేతంపై దృష్టిసారించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో జగన్ ప్రభావం అంతగా కనిపించడం లేదని, బలోపేతం కోసం కూడా అధిష్టానం కృషి చేయడం లేదనే పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణ నుండి ప్రముఖ నేతలు ఉన్నప్పటికీ.. సీమాంధ్రలో ఉన్నంత క్యాడర్ లేదనే చెప్పవచ్చు. ఆయా నేతలకు చెందిన సొంత క్యాడరే పార్టీ క్యాడర్‌గా ఉందని అంటున్నారు. అంతకుమించి ఆ పార్టీ బలంగా లేదని, అధిష్టానం దృష్టి కేంద్రీకరించక పోవడమే కారణమంటున్నారు. పార్టీ పెద్దలు తమ ప్రాంతంలో క్యాడర్ పెంపుపై దృష్టి సారించకపోవడంపై జిల్లాల నాయకులు, కార్యకర్తలు కూడా అసంతప్తితో ఉన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని విజయమ్మ ఈ నెల 25 నుండి తెలంగాణవ్యాప్తంగా పదిరోజుల పాటు పర్యటించనున్నారని అంటున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు ఆమె పర్యటించనున్నారు. ఆయా జిల్లాలో పర్యటించనున్న విజయమ్మ పార్టీ క్యాడర్ పెంపు పైన దృష్టి సారించనున్నారు. విజయమ్మ తన పర్యటనతో ఇప్పటికైనా తెలంగాణపై ఫోకస్ పెట్టడంపై పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా విజయమ్మ గతంలో కంటే క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారట.
జగన్‌కు బెయిల్ వస్తుందో రాదో.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియని నేపథ్యంలో ఇక మరింత చొచ్చుకు వెళ్లాలని, రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటించాలని ఆమె భావిస్తున్నారట. అందులో భాగంగా నిరాశలో ఉన్న తెలంగాణలోని తమ పార్టీ క్యాడర్‌ను ఉత్తేజపరిచి, అక్కడ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications