వరదలు: దట్ ఈజ్ మోడీ, ఢిల్లీకి వెళ్లే కిరణ్ ఎక్కడ?

ఇటీవల 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించబడిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉత్తరాఖండ్‌లో ఏరియల్ సర్వే చేశారు. శనివారం పరిస్థితులు అనుకూలంగా లేకున్నప్పటికీ ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. ఉత్తరాఖండ్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు వెయ్యి మంది చిక్కుకున్నారని తెలియగానే ఆయన స్పందించారు. హరిద్వారా తదితర ప్రాంతాల్లో పర్యటించిన మోడీ తమ రాష్ట్ర యాత్రికులకు బాసటగా నిలిచారు.
సత్వర సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ సౌకర్యాలు పెద్దగా లేని విషయం గుర్తించిన మోడీ విమానా ద్వారా యాత్రికులను గుజరాత్ తరలించారు. మోడీ రెండు విమానాలు, నాలుగు వందల వాహనాలలో తమ రాష్ట్రం వారిని తరలించే ఏర్పాట్లు చేశారు. అధికారులతో సహాయ బృందాలను నియమించారు. తన రాష్ట్రానికి చెందిన భక్తులు చిక్కుకోవడంతో మోడీ వెంటనే స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అదే సమయంలో మన రాష్ట్రం నుండి నాలుగున్నర వేల మంది వెళ్లారు. ఇప్పటికే పలువురు మృతి చెందారు.
ఇద్దరు మంత్రులను, అధికారులు సహాయక కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లారు. మంత్రులు కూడా వాతావరణం సహకరించక పోవడంతో మిన్నకుండిపోయారు. అయితే అధిష్టానాన్ని కలిసేందుకు నిత్యం ఢిల్లీ వెళ్లే కిరణ్.. ఉత్తరాఖండ్‌లో అంత పెద్ద ఉపద్రవం వచ్చి పెద్ద ఎత్తున తెలుగువారు చిక్కుకుపోతే ఎందుకు వెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లేందుకు తీరిక దొరుకుతున్న కిరణ్‌కు డెహ్రాడూన్ వెళ్లేందుకు దొరకకపోవడం బాధాకరమంటున్నారు.
నరేంద్ర మోడీకి ఉన్న తీరిక కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో పలుమార్లు మాట్లాడారు. మంత్రుల బృందాన్ని పంపించారు. అయినా ముఖ్యమంత్రి వెళ్తే బాధితులకు మరింత భరోసా ఉంటుందని చెబుతున్నారు. అయితే కిరణ్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయన ఇక్కడి నుండే అంతా సమీక్షిస్తున్నారని, కేంద్రమంత్రులు చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తదితరులు చర్యలు సమీక్షిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications