శ్రీనగర్ కాన్వాయ్‌పై అటాక్: జవాన్ సతీమణి ఆత్మహత్య
కోల్‌కతా: రెండు రోజుల క్రితం జమ్ము కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్ వాహనం పైన జరిగిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో ఓ సైనికుడి సతీమణి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో ఆమె తనకు తానుగా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
మృతి చెందిన జవాన్ ఆదిత్య నంది సతీమణి ప్యూ నందీ వయస్సు 25. ఆమె బంకురాలో కాల్చుకొని మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ఇరవై నాలుగు గంటల ముందు ఉగ్రవాదులు జవాన్ల వాహనంపై దాడి జరిపిన విషయం తెలిసిందే.

చొరబాటు అడ్డుకున్న సైన్యం
పూంఛ్ జిల్లా కెరి సెక్టార్‌లో కొందరు చొరబాటుదారుల ప్రయత్నాన్ని సైన్యం బుధవారం అడ్డుకుంది. వాస్తవాధీన రేఖ వద్ద ఇద్దరు ముగ్గురు సాయుధులను చూసిన జవాన్లు కాల్పులు ప్రారంభించారు. ప్రధాని, సోనియా గాంధీలు రాష్ట్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అన్ని చోట్ల కట్టుదిట్టం చేశారు.
కాగా, ఉగ్రవాద చర్యలను భారత్ సమర్థవంతంగా, సంఘటితంగా ఎదుర్కొంటుందని, దాడులు పిరికివారి చర్య అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్న విషయం తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూ కాశ్మీర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications