ఫెరా ఉల్లంఘన: హైకోర్టులో పార్థసారథికి చుక్కెదురు

ఫెరా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో తనకు శిక్ష విధిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ సెషన్స్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆబ్కారీ, సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
తాము ఏ విధమైన ఉల్లంఘనలకు పాల్పడలేదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన గతంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాము తమ కంపెనీకి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి 1994 అక్టోబర్ 13వ తేదీన కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని ఆయన చెప్పారు. స్విస్ కంపెనీకి ముందుగా 15 శాతం అడ్వాన్స్‌గా పంపించడానికి, మిగతా 85 శాతం విడతలవారీగా చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు ఆంధ్రా బ్యాంక్ ఖాతా నుంచి అడ్వాన్స్ మొత్తం 60 లక్షల రూపాయలు స్విస్ కంపెనీకి పంపించామని, ఆరు నెలల తర్వాత మిగతా మొత్తాన్ని ఆంధ్రా బ్యాంక్ చెల్లించాల్సి ఉందని, అయితే అందుకు బ్యాంక్ నిరాకరించిందని ఆయన చెప్పారు. సమయానికి డబ్బు చెల్లించనందు వల్లనే ముందు చెల్లించిన సొమ్మును స్విస్ కంపెనీ జప్పు చేసుకుందని మంత్రి చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఎక్కడా తప్పు పట్టలేదని చెప్పారు.
విదేశీ కరెన్సీని తాము ఇతర ప్రయోజనాలకు వాడలేదని స్పష్టం చేశారు. స్విస్ కంపెనీతో ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని పార్థసారథి చెప్పారు. ముఖేష్ అనే వ్యక్తితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. ట్రిబ్యునల్‌లో కేసు విచారణ విషయంలో తమ న్యాయవాది సమాచార లోపం వల్ల సరిగా వ్యవహరించలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications