తెలంగాణ: వారం, పది రోజుల తర్వాతనే ప్రకటన?
న్యూఢిల్లీ: తెలంగాణపై ఇప్పుడే ప్రకటన వెలువడకపోవచ్చునని అంటున్నారు. నిర్ణయాన్ని ప్రకటించడానికి వారం పదిరోజులు పట్టవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, అది సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది.
ఎన్నికల సమయంలో తెలంగాణాకు సానుకూలంగా మాట్లాడాం కాబట్టి తెలంగాణ ఇచ్చేయడమే మంచిదని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ ఇచ్చేయడం అంటే తేనె తుట్టెను కదిలించడమేనని ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. తెలంగాణాను ఇచ్చేస్తే గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ వంటి అంశాలు కీలకమైన సమస్యలుగా తెరపైకి వస్తారని వారు అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు.
సీమాంధ్ర నేతలకు విహెచ్ విజ్ఝప్తి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అధిష్టానం ఏర్పాటు చేయాలనుకుంటున్న తరుణంలో సీమాంధ్ర నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని, దయచేసి సహకరిచాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే మనం అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమకు సమైక్యం వద్దు పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని వీహెచ్ అన్నారు. తెలంగాణ వస్తేనే తమకు భవిష్యత్ అని విద్యార్థులు భావిస్తోన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే సీమాంధ్ర నేతలెందుకు పట్టించుకోరని ఆయన ప్రశ్నించారు.

రాజయ్య ధీమా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా వస్తుందని సిరిసిల్ల కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి హాని ఉండదని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రసక్తేలేదని, అలాంటి ఆలోచన కూడా కేంద్రానికి లేదని ఆయన వివరించారు.
విడిపోయి కలిసుందామన్న గీతారెడ్డి
తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, రాష్ట్ర విభజన జరగడమే మంచిదని, విడిపోయి కలిసుండడమే మంచిదని మంత్రి జె గీతారెడ్డి అన్నారు. గత ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతూనే ఉందని ఆమె అన్నారు. మన దేశంలోనే కర్ణాటక, తమిళనాడులో తెలుగు వారున్నారని, మనమంతా ఎక్కడున్నా తెలుగు వాళ్లమేనని, తెలుగు వాళ్ల సంస్కృతి ఎక్కడున్నా ఒక్కటేనని, విడిపోయి కలిసుండటమే మంచిదని గీతారెడ్డి అభిప్రాయపడ్డారు.
సమస్యలుండవన్న పొన్నాల
రాష్ట్ర విభజన జరిగితే ఎలాంటి సమస్యలు ఉండవని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. విభజన జరిగితే సమస్యలు వస్తాయని సీమాంధ్ర నేతలు చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. సమస్యలనేవి సీమాంధ్ర నేతల సృష్టి అని అన్నారు. ముందు తెలంగాణపై నిర్ణయం కానివ్వండని, ఆ తర్వాత సమస్యలను రాజ్యాంగ పరిధిలో పరిష్కరించుకుందామని పొన్నాల తెలిపారు. తెలంగాణ వస్తుందనే నమ్మకం తమకుందని తెలిపారు. తెలంగాణ వస్తే కాంగ్రెస్ గెలిచితీరుతుందని పొన్నాల తెలిపారు.
తెలంగాణ వస్తుందన్న సునీత
ప్రత్యేక తెలంగాణపై త్వరలో నిర్ణయం వెలువడనుందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందనే నమ్మకం తమకు ఉందని రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ముగ్గురు నేతలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఇవాళ నిర్ణయం వెలువడుతుందనే ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, విడగొట్టడం అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయని ఆమె అన్నారు.
ఇవ్వాల్సిందేనన్న డికె అరుణ
ప్రత్యేక తెలంగాణపై కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర మంత్రి డికె అరుణ అన్నారు. త్వరగా తెలంగాణపై ప్రకటన చేయాలని దిగ్విజయ్ సింగ్‌ను కోరామని అన్నారు. దీనిపై దిగ్విజయ్ సింగ్ సానుకూలంగా స్పందించారని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని, త్వరలోనే సోనియా గాంధీ ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పినట్లు మంత్రి అరుణ తెలిపారు.












Click it and Unblock the Notifications