తెలంగాణపై తుది నిర్ణయమే: సోమవారం సిడబ్ల్యుసి?
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సోమవారం కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) జరుగుతుందా? అవునని అంటున్నారు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. సాధ్యమైనంత త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెసు కోర్ కమిటీ శుక్రవారం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సూచించారు.
ముగ్గురు రాష్ట్ర అగ్రనేతలను ఢిల్లీలో ఉండాలని అడగడాన్ని బట్టి తెలంగాణపై నిర్ణయం చేసే ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు భావిస్తున్నారు. కోర్ కమిటీ సమావేశంలో బొత్స సత్యనారాయణ 16 నిమిషాల పాటు, దామోదర రాజనర్సింహ 22 నిమిషాల పాటు, కిరణ్ కుమార్ రెడ్డి గంటపాటు ప్రజంటేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

సోమవారమే సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. కోర్ కమిటీలో తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని కాంగ్రెసు రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. తాము కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడడం లేదని, తమ కార్యాచరణను తాము రూపొందించుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నిరంజన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ అంశాన్ని నాన్చడానికే సమావేశాల డ్రామా ఆడుతోందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెసు తెలంగాణపై మోసం చేయడానికే కాంగ్రెసు సిద్ధపడిందని ఆయన అన్నారు. తెలంగాణపై ఏం జరిగలేదనే ఆగ్రహంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని, కాలయాపన చేయడానికే కాంగ్రెసు సిద్ధపడిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు దేవీప్రసాద్ అన్నారు.












Click it and Unblock the Notifications