తెలంగాణ: సోనియా 'ఇంటెలిజెన్సీ', కిరణ్ డౌట్స్‌కు క్లారిటీ
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై నాన్చివేసే ధోరణితో లేదని, తేల్చేందుకే సిద్ధమవుతోందని, అది కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం ఢిల్లీ నేతల్లో జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రానికి పెద్ద సమస్యగా తయారైన ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆమె కూడా భావిస్తున్నారని అంటున్నారు.
రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ ఇస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. శుక్రవారం నాటి కోర్ కమిటీ భేటీ తర్వాత కాంగ్రెసు మళ్లీ నాన్చివేస్తోందనే విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారట ఢిల్లీ పెద్దలు. సాధ్యమైనతే పంచాయతీ ఎన్నికలలోపు... అది వీలుకాకుంటే సమావేశాలకు ముందే తెలంగాణపై తేల్చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారట.

తెలంగాణ సమస్యకు రాష్ట్రం ఇవ్వడమే పరిష్కారమని సోనియా భావిస్తున్నారట. విభజన జరగకుంటే ఇది ఎప్పటికీ కొనసాగుతుందని, విభజిస్తే కొన్నాళ్లకు చల్లబడుతుందనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. సోనియా గాంధీ ఇంటలిజెన్స్ సంస్థల ద్వారా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్నంతటినీ తెప్పించుకున్నారట. దానిని బట్టే నిర్ణయం ఉంటుందని అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన రోడ్ మ్యాపులను పరిశీలించినప్పటికీ, అన్నింటిని పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగానే వెళ్లాలని సోనియా భావిస్తున్నారని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పెద్దగా సమస్యలేమీ రావని సోనియా తెలుసుకున్నారట. అయితే విభజన జరగకుంటే మాత్రం సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారట.
ఇప్పటికే బిజెపి, టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీది మాట్లాడలేని పరిస్థితి. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉందని అధిష్టానం గుర్తించిందట. దీంతో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం ద్వారానే సమస్యను పరిష్కరించవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రకటన ఎలా చేయాలనే దాని పైనే తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.
తెలంగాణపై ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని అయితే, హైదరాబాదులోని సీమాంధ్ర ప్రాంతం వారికి నమ్మకం కలిగించే దిశలో ఆలోచిస్తున్నారని అంటున్నారు. హైదరాబాదును వదిలేది లేదని తెలంగాణ నేతలు, హైదరాబాదే అసలు సమస్య అని సీమాంధ్ర నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ నివసించే ఇతర ప్రాంతాల వారికి ఎలాంటి హామీ ఇవ్వాలనే అంశంపై చర్చిస్తున్నారని అంటున్నారు.
విభజన ద్వారా వచ్చే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే దిశలో ఆలోచించాకనే ప్రకటన చేయాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా రాజకీయంగా కాంగ్రెసు పార్టీకి లాభించే సమయంలో, లాభించే విధంగా ప్రకటన చేయాలని చూస్తున్నారని అంటున్నారు. విభజనపై ప్రకటన చేసినా తెరాసను పక్కన పెట్టాలని చూస్తున్నారట. అయితే విభజన హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఉంటుందా? కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందా? అనేది సస్పెన్స్ రేపుతోందని అంటున్నారు.
కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచే ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. కిరణ్ కోర్ కమిటీలో ప్రస్తావించిన అంశాలపై అధిష్టానం చర్చిస్తోందని సమాచారం. సిడబ్ల్యూసి త్వరలో భేటీ అయి ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు. కాగా జైపాల్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి వారు తెలంగాణ, సమైక్యాంధ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.












Click it and Unblock the Notifications