సహోద్యోగే ఆ మహిళను రేప్ చేసి, హత్య చేశాడు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండకు చెందిన అరుణ (35) భర్తతో కలిసి హైదరాబాదులోని కూకట్‌పల్లి ప్రాంతంలోని గాయత్రీనగర్‌లో నివసిస్తూ ఉండేది. భర్త ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి. అరుణ స్థానికంగా ఓ బుక్ బైండింగ్ కంపెనీలో పనిచేసేది. రోజు మాదిరిగానే ఆమె నిరుడు నవంబర్ 5వ తేదీ ఉదయం కంపెనీకి వెళ్లింది.
మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన ఆమె తిరిగి విధులకు రాలేదు. ప్రతి రోజూ అర గంటలోగానే తిరిగి వచ్చేది. రెండు గంటలైనా రాకపోవడంతో కంపెనీవారు ఫోన్ చేశారు. దానికి ఆమె నుంచి సమాధానం రాలేదు. దాంతో బుక్ బైండింగ్ కంపెనీ ఉద్యోగి మహేష్ ఇంటికి వెళ్లి చూశాడు. తలుపులు వేసి ఉన్నాయి. ఎంతగా పిలిచినా స్పందన రాకపోవడంతో తలుపులు నెట్టి లోనికి వెళ్లాడు.
అక్కడి దృశ్యం చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో అరుణ వివస్త్రగా పడి ఉంది. మెడ, కాళ్లు, చేతులు వైర్లతో కట్టి ఉన్నాయి. మహేష్ ద్వారా సమాచారం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు స్నిఫర్ డాగ్స్‌ను రప్పించారు. డాగ్ స్క్వాడ్ ఆమె పనిచేసిన బుక్ బైండింగ్ కంపెనీ వద్దకు, అక్కడి నుంచి ఆ కంపెనీకే చెందిన మరో బ్రాంచ్ వద్దకు వెళ్లి ఆగింది. దీంతో బుక్ బైండింగ్ కంపెనీకి చెందినవారే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ లేబొరేటరీ నిర్వహించిన డిఎన్ఎ పరీక్షల ద్వారా నిందితుడు రామకృష్ణా రెడ్డిని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని ఆదివారంనాడు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications