హుటాహుటిన ఆసుపత్రికి సోనమ్ వాంగ్‌చుక్- ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం అయింది. కొద్దిసేపటి కిందటే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించారు. నీట్ వంటి పరీక్షా పేపర్ లీక్ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచేందుకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్నారాయన. పరీక్షల లీకేజీలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ కిందటి నెల 28న ఈ నిరసన దీక్షను చేపట్టారు.
దాదాపు మూడు వారాలుగా సాగుతున్న ఈ దీక్ష కారణంగా వాంగ్‌చుక్ శారీరక స్థితి తీవ్రంగా క్షీణించడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయనను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేపర్ లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్రమంగా విషమించింది.

వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా బలగాలను మోహరించారు. నిరసనకారులు ఎటువంటి ఘర్షణలకు దిగకుండా జంతర్ మంతర్ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు ఢిల్లీ పోలీసులు. వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యత తమపై ఉందని, డాక్టర్ల సలహా మేరకే ఆయన దీక్షను భగ్నం చేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఆసుపత్రికి తరలించడానికి ముందు శుక్రవారం రాత్రి సోనమ్ వాంగ్‌చుక్ ఓ భావోద్వేగపూరిత వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. గత 20 రోజులుగా నిరంతరాయంగా సాగుతున్న ఉపవాస దీక్ష వల్ల తన శరీర బరువు 20 శాతం మేర తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శరీరంలోని కండరాల పనితీరుపై కూడా దీని ప్రభావం పడిందని, అయినప్పటికీ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే తన మానసిక స్థైర్యం మాత్రం చెక్కు చెదరలేదని అన్నారు.
ఈ నెల 20న దేశ రాజధానిలో ప్రతిపాదించిన ఛలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన పిలుపునిచ్చారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉల్లిపాయల ధరలు పెరిగితేనే జవాబుదారీతనం వహించే రాజకీయ నాయకులు.. కోట్ల మంది యువత జీవితాలతో ముడిపడి ఉన్న విద్యా వ్యవస్థలోని లోపాలపై ఎందుకు స్పందించట్లేదని అన్నారు.












Click it and Unblock the Notifications