EPFO VISHWAS 2026: కేంద్రం కొత్త స్కీమ్! ఆరు నెలలే టైమ్
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) చందాదారులకు, అలాగే సంస్థల యజమానులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీలు, ఈపీఎఫ్ఓ మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న పెండింగ్ వివాదాలు, జరిమానాల గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు 'విశ్వాస్ 2026' (VISHWAS 2026) పేరిట ఒక సూపర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.
కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకం జూన్ 29 నుంచే అమల్లోకి వచ్చింది. కేవలం ఆరు నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సువర్ణావకాశం ద్వారా అటు కంపెనీల భారం తగ్గడంతో పాటు, ఇటు ఉద్యోగుల సొమ్ము కూడా సేఫ్‌గా చేతికి అందనుంది.

యజమానులకు భారీ ఊరట..ఖర్చు తగ్గేలా!
సాధారణంగా కంపెనీలు ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను సకాలంలో డిపాజిట్ చేయకపోతే భారీగా పెనాల్టీలు, డ్యామేజ్ ఛార్జీలు పడుతుంటాయి. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తూ ఏళ్ల తరబడి నలిగిపోతుంటాయి. ఇప్పుడు 'విశ్వాస్ 2026' పథకం ద్వారా అలాంటి పాత తగాదాలన్నింటినీ చాలా తక్కువ ఖర్చుతో సెటిల్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ కల్పించింది.
2024 జూన్ 14 కంటే ముందు జరిగిన పొరపాట్లు, పెండింగ్ పెనాల్టీలపై భారీగా రాయితీలు ఇస్తున్నారు. అయితే, చట్టప్రకారం కట్టాల్సిన అసలు వడ్డీని మాత్రం కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ పథకం కింద సెటిల్ చేసుకుంటే.. ఇకపై ఆ వివాదంపై మళ్లీ కోర్టులకు వెళ్లబోమని యజమానులు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నాలుగు రకాల కేసులకే వర్తింపు
ఈ స్కీమ్ అందరికీ వర్తించదు. కేవలం నిర్దేశిత నిబంధనల ప్రకారం కింది నాలుగు రకాల సమస్యలు ఉన్న కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
- 1- పెనాల్టీలు, డ్యామేజ్ ఛార్జీలపై ఇప్పటికే కోర్టుల్లో లేదా ట్రిబ్యునళ్లలో కేసులు నడుస్తున్న వారు.
- 2- ఫైనల్ ఆర్డర్స్ వచ్చి కూడా ఇంకా పెనాల్టీ డబ్బులు పూర్తిగా రికవరీ కాని కేసులు.
- 3- నోటీసులు అందుకుని, తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్న యాజమాన్యాలు.
- 4- తప్పులు జరిగి.. ఇంకా ఈపీఎఫ్ఓ నుంచి నోటీసులు రాని కంపెనీలు.
అయితే ఇప్పటికే పెనాల్టీలు పూర్తిగా కట్టేసిన వారికి, కంపెనీల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడిన కేసులకు మాత్రం ఈ పథకం అస్సలు వర్తించదు.
ఉద్యోగులకు వచ్చే లాభం ఏంటి?
నేరుగా చూస్తే ఇది కంపెనీల కోసం తెచ్చిన పథకంలా అనిపించినా.. అసలు లాభం పొందేది ఉద్యోగులే. కంపెనీలు కోర్టు కేసుల సాకుతో పీఎఫ్ సొమ్మును ఇరకాటంలో పెడుతుంటాయి. ఈ పథకం వల్ల యాజమాన్యాలు త్వరగా సెటిల్మెంట్ చేసుకుంటాయి కాబట్టి, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లోకి రావాల్సిన బకాయిలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా జమ అవుతాయి. ఉద్యోగుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, వారి సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడానికే ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది.
ఆన్‌లైన్‌లోనే అంతా.. ప్రత్యేక సెల్స్ ఏర్పాటు
ఈ ప్రక్రియ అంతా డిజిటల్ రూపంలో చాలా పారదర్శకంగా సాగనుంది. అర్హులైన యజమానులు ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్‌లోకి వెళ్లి డిజిటల్ సిగ్నేచర్ (DSC) లేదా ఈ-సైన్ (e-Sign) ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అప్లికేషన్లను వేగంగా పరిశీలించి, గడువులోగా సమస్యలను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్ఓ జోనల్, రీజినల్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా 'విశ్వాస్ సెల్స్' (VISHWAS Cells) ఏర్పాటు చేశారు. కేసులు క్లియర్ చేసుకోవాలనుకునే కంపెనీలకు ఈ 6 నెలల సమయం ఒక గొప్ప వరమనే చెప్పాలి.














Click it and Unblock the Notifications