కాకి తన్నిపాయెరన్నా: ఓ ఇంజనీర్ ఆత్మహత్య
బెంగళూర్: అభ్యసించిన శాస్త్రీయ విద్యకన్నా మూఢనమ్మకానిదే పైచేయి అయింది. మూఢ నమ్మకం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో జరిగింది. 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిపై ఓ పత్రిక ఆసక్తికరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఆనంద్ విహెచ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కాకి అతని తలపై అంతకు ముందు రెండుసార్లు తన్నిందట. కాకి తలపై తంతే మరణం తప్పదనే మూఢనమ్మకం వెంటాడి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
తన సోదరుడు తన ఫోన్ కాల్స్‌ను తీసుకోకపోవడంతో అన్న హుటాహుటిన వచ్చేసరికి అతను నురగలు కక్కుతూ కష్టం మీద శ్వాస తీసుకుంటున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించాడు. అయితే, ఆస్పత్రికి చేరుకునే లోగానే ఆనంద్ మరణించాడు.

బుధవారంనాడు కాకి అతని తలపై రెండుసార్లు తన్నిందని, దాంతో అతను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడని, తన తల్లికి ఈ విషయం చెప్పాడని, తమ తల్లి స్థానిక జ్యోతిష్కుడిని సంప్రదించిందని, హనుమంతరాయ ఆలయంలో పూజలు చేయాలని జ్యోతిష్కుడు చెప్పాడని, అయినా అతనికి విశ్వాసం కుదరలేదని ఆనంద్ సోదరుడు విహెచ్ హంపన్న అన్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గదిలో విషం సీసా ఏదీ కనిపించలేదు. ఎక్కడో విషం తాగేసి గదికి వచ్చి తలుపులు బిగించుకుని ఉంటాడని అంటున్నారు. కాకి శని వాహనంగా పరిగణిస్తారు. అది తలపై తంతే చావు తప్పదనే మూఢనమ్మకం ఉంది.












Click it and Unblock the Notifications