సీమను విభజిస్తే సహించం, మేం వీక్: టిజి వెంకటేష్

తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు ఇంకా అనుకోలేదని, ఇచ్చేస్తారేమోననే భయమూ ఆందోళనతో తాము మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ విడిపోతుందుంటేనే బాధ కలుగుతోందని, దానికి తోడు రాయలసీమను విడగొట్టడం ఎందుకని ఆయన అన్నారు. తాము ఇప్పటికే బళ్లారిని కోల్పోయామని, దానివల్ల తుంగభద్ర నీరు తమకు రాకుండా పోతోందని, మంచినీళ్లు కూడా తమకు అందడం లేదని ఆయన అన్నారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలను రాయలసీమలో కలపాలని ఆయన అన్నారు. దానివల్ల జలవివాదాలు రావని, అంతేకాకుండా ఆ ప్రాంతాల ప్రజలతో రాయలసీమ ప్రజలకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వాలని చెప్పిన సీమాంధ్ర నాయకుల వద్దకు ఈ ప్రాంత ప్రజలు వెళ్లి నిర్ణయం మార్చుకోవాలని అడగాలని, ఈ విషయంలో సీమాంధ్ర ప్రజల నుంచి సరైన స్పందన లేదని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము ప్రణబ్ ముఖర్జీ కమిటీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు కోస్తాంధ్ర నాయకులను కలుపుకుని తాము పోరాటం చేస్తూనే ఉన్నామని, కానీ సీమాంధ్ర ప్రజల నుంచి స్పందన లభించడం లేదని, ఈ స్థితిలో రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగితే సీమాంధ్ర ప్రజలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సరిగా స్పందించకుండా ప్రజలు విభజనకు అవకాశం ఇచ్చినవారవుతారని ఆయన అన్నారు. సమైక్యవాదం బలోపేతం కావాలంటే అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులు ఒకే మార్గంలోకి రావాలని ఆయన అన్నారు. గతంలో తాము త్యాగాలు చేసి రాజధానిని పోగొట్టుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే రాయలసీమ ఎడారి అవుతుందని ఆయన అన్నారు.
గద్వాల తెలంగాణలోనే..
నెల్లూరు, ప్రకాశం జిల్లాలను, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల ప్రాంతాలను కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే టిజి వెంకటేష్ డిమాండ్‌పై గద్వాల నుంచి శానససభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి డికె అరుణ స్పందించారు. గద్వాల, ఆలంపూర్ ప్రాంతాలు తెలంగాణలోనే ఉంటాయని ఆమె అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మంత్రులందరూ కట్టుబడి ఉండాలని ఆమె శనివారం అన్నారు.












Click it and Unblock the Notifications