మోడీకి వీసా వద్దు: ఒబామాకు లేఖ, ఏచూరి కొత్త ట్విస్ట్
వాషింగ్టన్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడికి వీసా ఇవ్వవద్దని, ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతు పార్లమెంటుకు చెందిన 65 మంది సభ్యులు అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖలు రాశారు. ‘అమెరికా రావడం కోసం మోడీకి వీసా నిరాకరించే ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని మేము వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాం' అని 12 పార్టీలకు చెందిన ఎంపీలు ఒకే రకమైన లేఖల్లో ఒబామాను కోరారు.
ఒక లేఖపై 25మంది రాజ్యసభ సభ్యులు, మరో లేఖపై 40 మంది లోక్‌సభ సభ్యులు గత ఏడాది సంతకాలు చేయగా, ఆ లేఖలను గత ఆదివారం వైట్‌హౌస్‌కు మళ్లీ ఫ్యాక్స్ చేసారు. అమెరికా పార్లమెంటేరియన్లు, మేధావులు, ప్రభుత్వ అధికారులను కలవడం కోసం బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్న తరుణంలో ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఈ లేఖల కాపీలను మీడియాకు అందజేసింది. ఈ సమావేశాల్లో మోడీకి వీసా జారీపై నిషేధాన్ని ఎత్తివేయాలని తాను అమెరికన్లను కోరుతానని గత ఆదివారం న్యూయార్క్‌లో విలేఖరుల సమావేశంలో స్వయంగా రాజ్‌నాథ్ సింగే చెప్పారు.

కాగా ఈ లేఖలపై సంతకాలు చేసిన వారిలో రాజ్యసభ సభ్యులు సిపిఎంకు చెందిన సీతారాం ఏచూరి, సిపిఐకి చెందిన ఎంపి అచ్యుతన్‌లు కూడా ఉన్నారు. అయితే ఈ విషయమై సీతారాం ఏచూరిని సంప్రదించగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, తాను ఆ లేఖపై సంతకం చేయలేదని, బహుశా అది కట్ అండ్ పేస్ట్ పని అయి ఉండవచ్చనిపిస్తోందన్నారు. ఇలాంటి పని చేయమని అమెరికా ప్రభుత్వాన్ని కోరే వారిలో తాను చివరి వాడిగా ఉంటానని చెప్పారు.
ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమకు ఇష్టం ఉండదన్నారు. ఇవన్నీ కూడా దేశంలోనే రాజకీయంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలని ఏచూరి చెప్పారు. అచ్యుతన్ కూడా అలాంటి లేఖ రాయలేదని చెప్పారు. అయితే అదీబ్ మాత్రం ఈ ఇద్దరూ లేఖపై సంతకం చేశారని అంటూ, వారు ఇప్పుడు ఎందుకు మాటమారుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications