సమైక్యం: రాజీవ్ విగ్రహం ద్వంసం, చిరంజీవిపై నిప్పులు
విశాఖపట్నం/విజయవాడ: అనంతపురం జిల్లాలో సీమాంధ్ర బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. అనంత పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సమైక్యవాదాలు ధ్వంసం చేసి, చెప్పుల దండ వేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అన్ని కళాశాలల విద్యార్థులు మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కేంద్ర కాంగ్రెసు పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం ఐదు గంటల లోపు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామి హెచ్చరించారు.

పలు ప్రాంతాల్లో రోడ్ల పైనే సమైక్యవాదులు వంటా వార్పు నిర్వహించారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు రాళ్ల విసిరారు. పోలీసుసులు వారిని చెదరగొట్టారు. భీమవరంలో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద దేవినేని అవినాష్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు.
కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, దగ్గుపాటి పురంధేశ్వరి, చిరంజీవి, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు రఘువీరా రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా ఎమ్మెల్యే రాజన్న దొర విభజన నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విభజనపై యూపిఏ ఏకగ్రీవ తీర్మానంపై తానేమీ మాట్లాడేది లేదని కిల్లి కృపారాణి చెప్పారు.
కేంద్రమంత్రి చిరంజీవి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని సమైక్యవాదులు మండిపడుతున్నారు. 2009 ఎన్నికల్లో డెబ్బై లక్షల ఓట్లతో తాము గెలిపిస్తే ఆ తర్వాత పిఆర్పీని కాంగ్రెసు పార్టీకి కేంద్రమంత్రి పదవి కోసం తాకట్టు పెట్టారని, ఇప్పుడు సీమాంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని సోనియాకు తాకట్టు పెట్టి అధిష్టానం నిర్ణయమంటున్నారని మండిపడ్డారు.
విభజనకు ప్రధాన కారణం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడని విమర్శించారు. కావూరి సాంబశివ రావు కేంద్రమంత్రి పదవి కోసం సమైక్యవాదాన్ని విడిచి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్ గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు బాటలో నడవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications