టి తీర్మానాన్నిఓడిస్తాం, ఇంకా సమైక్యమే: టిజి వెంకటేష్
హైదరాబాద్: తాము ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. మినిస్టర్స్ క్వార్టర్సులో రాయలసీమ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధిలు సమావేశమయ్యారు. అనంతరం టిజి వెంకటేష్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానాన్ని ఎలా ఓడించాలన్న అంశంపై తాము నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.
అవసరమైతే హైకోర్టులో, సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నామన్నారు. రాయలసీమకు నికల జలాలు, రాజధాని ఇస్తేనే రాయల ఆంధ్రాకు ఒప్పుకుంటామని చెప్పారు. విభజన విషయంలో ఇప్పటికైనా ప్రతిపక్షాలు పెదవి విప్పాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఓ లేఖ ఇస్తే రాష్ట్రాన్ని తాము సమైక్యంగా ఉంచుతామని చెప్పారు.

పార్టీలు విధానాలు మార్చుకొని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో విడిపోతే నికర జలాలపై సీమకు హక్కులు కల్పించాలన్నారు. రాజధానిని రాయలసీమకే ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే రాయల ఆంధ్రకు ఒప్పుకుంటామని లేదంటే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాయలసీమ వాకులు కష్టపడ్డారు, నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమకు ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలన్నారు. తాము మరోసారి ఇవ్వాళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి రాజీనామా సమర్పిస్తామన్నారు. ఈ భేటీలో మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, అహ్మదుల్లా, ఎమ్మెల్యేలు పూతలపట్టు రవి, వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications