విడిపోయినా కలిసుందాం, చరిత్ర తర్వాత చెప్తా: బాబు

తాను రాజకీయాలు మాట్లాడటం లేదని, తెలుగు వారి కోసం, తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టిడిపి ఎప్పుడూ పాటుపడుతుందన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమమే టిడిపికి ముఖ్యమన్నారు. తెలుగు వారి సంక్షేమం కోరే టిడిపి ఎప్పుడు ఉంటుందన్నారు. తెలుగు వారికి ఏం కావాలో అన్నీ చేస్తామన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని, రేపో ఎల్లుండో రాజకీయాలు మాట్లాడుతానని, చరిత్ర అంతా మాట్లాడుకుందామన్నారు.
అన్ని ప్రాంతాలకు కేంద్రం సమన్యాయం చేయాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము 2008లో కేంద్రానికి ఓ లేఖ పంపించామని అన్నారు. చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి తాము కొన్ని డిమాండ్లు చేస్తున్నామన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు, రాజధానికి చాలా వ్యయం అవసరమవుతుందన్నారు. ఇరు ప్రాంతాల్లో ఇబ్బందులను తొలగించి... బాధ, ఆవేదన లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్నారు.
కొత్త రాజధాని ఏర్పాటు కోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. కొత్త రాజధానిలో కూడా హైదరాబాదు, బెంగళూరు, ముంబై, చెన్నై మాదిరి అభివృద్ధి చేయాలన్నారు. తమ హయాంలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇరు ప్రాంతాల్లోను జల, విద్యుత్, ఆర్థిక వనరుల అభివృద్ధికి కృషి చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఉద్యోగాలు, విద్యుత్ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్నారు. కేంద్రం ప్రకటన చేసి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. బిల్లు పెట్టాలని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు.
సమైక్య రాష్ట్రం కోసం ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తోందని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని, సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం టిడిపి పాటుపడుతుందన్నారు. తాము కేంద్రం, ఇతర పార్టీలతో తెలుగు వారి కోసం మాట్లాడుతామన్నారు. హైదరాబాదును రెండో రాజధాని చేసే విషయం, ఏ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారో తాను త్వరలో మాట్లాడుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications