తెలంగాణ బిల్లు పాసయ్యాకే విలీనం యోచన: కెసిఆర్

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రకటనను స్వాగతిస్తున్నామని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రకటనతో ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు, యూపీఏ మిత్రపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సిడబ్ల్యుసి ప్రకటనలో ఇంకా కొంత అస్పష్టత ఉందని, పూర్తిగా స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం తెలంగాణవాదులు ఉద్యమాలు చేశారని, దానికి అనుకూలంగానే కేంద్రం ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆంధ్రలో రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంలో అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే ఉమ్మడి రాజధాని విధివిధానాలేమిటో తెలియజేయాలని కాంగ్రెస్‌ను కోరారు. తెలంగాణ ప్రకటన చేయగానే సరిపోదని, దానికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యాకే కాంగ్రెస్‌ను పూర్తిగా నమ్ముతామని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే తాము అధికారికంగా సంబరాలు చేసుకుంటామని చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ కోసం మొక్కవోని దీక్షతో నాయకులు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, విద్యార్థులు, జేఏసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ కవులు, కళాకారులు ఆట పాటలతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారని ఆయన అన్నారు. 13 సంవత్సరాలుగా తనకు సహకరిస్తూ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను వదిలారని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ ప్రకటనతో హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎలాంటి భయాందోళనలు, అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన చెప్పారు. గతంలోని ఆవేశాలను మరిచిపోయి సామరస్యంగా ఉందామని సీమాంధ్ర ప్రజలకు తెలియజేశారు. తెలంగాణలో విద్యా, ఉపాధి అవకాశాలు పెరగాలంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలని ఆయన సూచించారు. కానీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యాకే పార్టీ విలీనం గురించి చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కల సంపూర్ణంగా సాకరమయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలంగాణవాదులకు సూచించారు.












Click it and Unblock the Notifications