తెలంగాణపై కాంగ్ ప్రకటన: తెరపైకి విదర్భ, గూర్ఖాలాండ్

విదర్భ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత విలాస్ ముత్తెమార్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తెలంగాణ డిమాండ్ కంటే ముందు నుంచే తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణతోపాటు విదర్భ రాష్ట్ర ఏర్పాటును ప్రక్రియను కూడా చేపట్టాలని, లేదంటే హింసాత్మక ఆందోళనలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆగస్టు 5న ఢిల్లీలో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం డార్జిలింగ్‍లో మంగళవారం జనజీవనం స్తంభించింది. జెఎంఎం సోమవారం నుండి 72 గంటల బందుకు పిలుపునిచ్చింది. గూర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బిమల్ గురుంగ్ మంగళవారం రాజీనామా చేశారు. తమ డిమాండ్లను కూడా కేంద్రం పరిశీలించాలని గూర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బిపిఎఫ్) నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంతో బలవంతంగా కలిసి ఉండలేమని బిజెఎం నేత రోషన్ గిరి అన్నారు. త్వరలోనే సోనియా, ప్రధానిని కలుస్తామని తెలిపారు.
అస్సాంలోని బోడోలాండ్‌లో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంది. ఇటు ఉత్తరప్రదేశ్‌లో హరిత్ ప్రదేశ్ ప్రాంత నేతలు కూడా గళమెత్తారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) నేత, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే యూపి, మధ్య ప్రదేశ్‌లలో ఉన్న బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కూడా అజిత్‌సింగ్ మద్దతునిస్తున్నారు. ఇంకా ఇతర రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు వెల్లువెత్తుతాయని, వాటిని అదుపు చేయాలని సిపిఎం ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ కేంద్రానికి సూచించారు.












Click it and Unblock the Notifications