నేతలకు అల్టిమేటం: 12 నుంచి ఎపి ఎన్జీవోల సమ్మె

స్వాతంత్య్ర దినోత్సవంనాడు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. విభజనను నిలిపి వేసే వరకు ఉద్యమిస్తామని ఏపీఎన్జీవో అసోసియేషన్-ఉద్యోగుల జెఎసి స్పష్టం చేసింది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులందరూ ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రిలోగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లేకపోతే సీమాంధ్రలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించింది.
సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశం వివరాలను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి.అశోక్ బాబు మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈనెల ఆరో తేదీ నుంచి శంఖారావం పేరుతో నూతన కార్యాచరణతో ఉద్యమానికి శ్రీకారం చుట్టునున్నట్టు చెప్పారు. ఐదో తేదీన జిల్లా స్థాయిల్లో బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఆరున జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్‌లో సమర్పించాలని డిమాండ్ చేస్తూ వారి ఇళ్ల దగ్గర ధర్నా చేస్తామని రాజీనామాలు చేయడానికి 12వ తేదీ వరకు వారికి గడువు ఇస్తున్నామని వివరించారు.
ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి త్వరలోనే సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి విభజన వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి 50 ఏళ్లపాటు అందరం కలిసి కృషి చేశామని, ఇప్పుడు ఆ నగరం కొందరిదేనని చెప్పటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పారు. తెలంగాణకు కావాలనుకుంటే మరో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు సునామీ తెచ్చి పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకోవాలని స్పష్టం చేశారు.
సమైక్య ఉద్యమాన్ని తీవ్రం చేయటానికి పార్టీలకతీతంగా ముందుకు వచ్చే అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, నాయకులతో 'రాష్ట్ర సమైక్య పరిరక్షణ' అనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని చెబుతున్నదని, సమైక్యాంధ్ర సంగతి తేలకుండా ఎన్నికలు పెడితే వాటిని బహిష్కరిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌తో 35 లక్షల మంది కోస్తా ప్రాంత వాసులకు అనుబంధం ఉందని ఎపి ఎన్జీవోలు చెప్పారు. ఇన్నాళ్లూ రాజకీయ నాయకులను నమ్మి మోసపోయామని, ఇక తమ ఉద్యమానికి తిరుగులేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications