ఫొటోలు: విభజనపై చిరంజీవి రాజీ, కావూరి కామ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన ఖాయమని తేలిపోయింది. ఏ విధమైన ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గేది లేదనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పదే పదే చెబుతున్న మాటలు, సోమవారం కేంద్ర మంత్రి పి. చిదంబరం రాజ్యసభలో చేసిన ప్రకటన ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బేరసారాల కోసం హైదరాబాద్‌పై సిడబ్ల్యుసి సమావేశం స్పష్టత ఇవ్వకుండా వదిలేసింది.
రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నాయకులు దాదాపుగా అంగీకరించినట్లే కనిపిస్తున్నారు. చర్చంతా ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ తిరుగుతోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలితంగా ప్రకటించాలని, రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయాలని, దేశానికి రెండో రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవితో పాటు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై సీమాంధ్ర నేతలు పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే దిగ్విజయ్ సింగ్ అనూహ్యంగా ఓ ప్రకటన చేశారు.

ఇఫ్తార్ విందుకే కిరణ్ రెడ్డి పరిమితం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడినప్పటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. సీమాంధ్ర జిల్లాల్లో విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరు రోజులుగా క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. బయట తక్కువగా పర్యటిస్తున్నారు. ఆదివారం మంత్రి రఘువీరా రెడ్డి ఇంటికి వెళ్లారు. మధ్యలో హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. సీమాంధ్ర ప్రతినిధులతో ఓ రోజు క్యాంప్ కార్యాలయంలోనే ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

బొత్స అప్పుడప్పుడు ఇలా..
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్యలో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చారు. కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వడానికి ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తుండడాన్ని ఖండిస్తూ ఆయన మాట్లాడారు. సోమవారం మహిళా కాంగ్రెసు సమావేశంలో మాట్లాడారు.

కావూరి మౌనంగానే ఉన్నారు..
కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు మౌనంగా ఉండిపోయారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు అధిష్టానం పెద్దల చుట్టూ తిరుగుతున్నా ఆయన కనిపించడం లేదు. ఇంతకు ముందు ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులకు నాయకత్వం వహించారు. కేంద్ర మంత్రి పదవి తీసుకున్న తర్వాత కావూరి మాట్లాడడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

చిరంజీవి హైదరాబాద్ డిమాండ్లు
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. అయితే, హైదరాబాద్ విషయంలో మాత్రం అధిష్టానం ముందు మాత్రం మూడు డిమాండ్లు పెట్టారు. చిరంజీవి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

అమెరికా నుంచే రాయపాటి..
రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి సమావేశం ప్రకటన వెలువరించినప్పుడు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించే గుంటూరు పార్లమెంటు సభ్యుడు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచే తీవ్రమైన నిరసనను వ్యక్తం చేస్తూ తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు.

పురంధేశ్వరి నాయకత్వం..
సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు దాదాపుగా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వం వహిస్తున్నారు. పురంధేశ్వరి నాయకత్వంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కలిసినప్పుడు వారి వాదనలను వినడానికి హైపవర్ కమిటీ వేస్తామని దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ కమిటీ ముందు కూడా సీమాంధ్ర రాష్ట్రానికి ఏమి కావాలో వినిపించాల్సిందే. కానీ రాష్ట్ర విభజనను వెనక్కి తీసుకోవాలనే వాదనను వినే పరిస్థితి లేదు.

లగడపాటి దూకుడు..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు ఆందోళనకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. విభజనను అడ్డుకోవడానికి తమ వద్ద బ్రహ్మాస్త్రాలున్నాయని, స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నాడని గతంలో చెప్పారు. విభజన ఖాయమైందని తెలియడంతో ఆయన కూడా హైదరాబాద్ మీదనే దృష్టి కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

ఉండవల్లి కోపమంతా కెసిఆర్ మీదనే..
రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో సభ పెట్టి తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. ఆయన కూడా హైదరాబాద్ చుట్టే తన వాదనను కేంద్రీకరించారు. హైదరాబాద్‌పై చిరంజీవి పెట్టిన డిమాండ్లనే ఆయన పెట్టారు.
హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతామని, ఈ పదేళ్ల కాలం ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ శాంతిభద్రత అంశం కేంద్రం చేతిలో ఉంటుందని ఆయన చెప్పారు. దీన్ని బట్టి హైదరాబాద్‌పై బేరసారాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. గతంలో మాదిరిగా కాకుండా కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సీమాంధ్ర నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, వాళ్లను భాగస్వాములను చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం వెలువరించింది.
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తగిన అవకాశం గానీ వెసులుబాటు గానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుకు తదితరులకు ఏ మాత్రం కల్పించలేదు. హైపవర్ కమిటీ కూడా సీమాంధ్ర రాష్ట్రానికి కావాల్సినవి ఏమిటో అడగండని చెప్పడానికి మాత్రమే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మోకాలడ్డుతారని భావించిన సీమాంధ్ర నాయకులు ఇప్పుడు ఏమీ మాట్లాడలేని స్థితిలో పడ్డారు. ఏమైనా, ఇది కాంగ్రెసు అధిష్టానానికి పరీక్షా సమయమే.












Click it and Unblock the Notifications