పటేల్ బుజ్జగింపు: బెట్టు వీడని సీమాంధ్ర ఎంపీలు

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ, వారు మెట్టు దిగడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయవద్దని ఆయన వారికి సూచించారు. అయితే, తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని వారు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరారు. విభజనపై వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని అహ్మద్ పటేల్ వారికి స్పష్టం చేశారు.
విభజన అనివార్యమైతే హైదరాబాద్ నగరాన్ని శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని లేదా దేశానికి రెండో రాజధానిగా చేయాలని వారు కోరారు. పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయవద్దని అహ్మద్ పటేల్ చేసిన సూచనకు వారు కాస్తా తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇప్పుడున్న స్థితిలో మౌనంగా కూర్చోలేమని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం.
రాష్ట్ర విభజనపై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని వారన్నారు. తమ వాదనను పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదని వారు తప్పు పట్టారు. సీమాంధ్రలో ఉద్యమాలు తలెత్తవనే నివేదికలు అందడం వల్లనే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారని వారు అన్నట్లు తెలుస్తోంది. అహ్మద్ పటేల్‌తో సమావేశమైనవారిలో కెవిపి రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, సుబ్బిరామిరెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications