రెండేళ్ల క్రితమే పెళ్లి: నేవీలో చేరి ప్రాణాలు విడిచి...
విశాఖపట్నం: జలాంతర్గామి ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలుగు వ్యక్తి రాజేష్‌కు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ఆయన 2011 జూన్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా బత్తిలికి చెందిన జ్యోతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దేశమాత సేవ కోసం రాజేష్ భారత నౌకాదళంలో చేరాడు. తొలుత నావికుడిగా జీవితం ఆరంభించిన రాజేష్ కరస్పాండెన్స్ పద్ధతిలో బిటెక్ పూర్తి చేసి జలాంతర్గామిలో మెకానికల్ ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందినట్లు వార్తలు వచ్చాయి.

రెండు నెలల క్రితం వరకు రాజేష్ విశాఖపట్నంలోనే పనిచేశాడు. ఇటీవలే ముంబైకి బదిలీ అయ్యాడు. అతను విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందినవాడు. నెల్లిముక్కు గ్రామానికి చెందిన అప్పలనాయుడు, కృష్ణవేణి దంపతులకు కలిగిన ముగ్గురు సంతానంలో రాజేష్ చిన్నవాడు.
పదేళ్ల క్రితం రాజేష్ నౌకాదళంలో సెయిలర్‌గా చేరాడు. ముంబైలో మొదట పోస్టింగ్ లభించింది. ఆ తర్వాత విశాఖపట్నానికి బదిలీ అయింది. ఇక్కడికి బదిలీ అయిన తర్వాత దూరవిద్య ద్వారా బిటెక్ చదివాడు. రెండు నెలల క్రితం ముంబైకి బదిలీ కావడంతో భార్యతో కలిసి వెళ్లాడు. ముంబైలోని నౌకాదళానికి చెందిన క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.
బుధవారం తెల్లవారు జామున జరిగిన జలాంతర్గామి ప్రమాదంలో ఆయన మరణించాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.












Click it and Unblock the Notifications