విభజన: దేవినేని నెహ్రూ సవాల్, ఉమ కౌంటర్

దీక్షల పేరుతో తెలుగుదేశం నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారని, చంద్రబాబు లేఖపై వివరణ ఇచ్చిన తర్వాతనే దేవినేని ఉమామహేశ్వర రావు దీక్ష చేపట్టాలని మల్లాది విష్ణు అన్నారు. దానికి ఉమామహేశ్వర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. 2004లో కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ఎందుకు పెట్టుకుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి విభజనకు బీజం వేశారనే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర హక్కుల పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా చేపట్ట తలచిన ఆమరణ దీక్ష ఈనెల 17కు వాయిదా పడింది. రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత లాల్‌జాన్‌భాషా దుర్మరణంతో రెండు రోజుల పాటు దీక్షను వాయిదా వేస్తున్నట్లు ఉమ ప్రకటించారు.
కాగా, చిత్తూరులో సమైక్యవాదుల దీక్షా శిబిరాన్ని మంత్రి గల్లా అరుణకుమారి సందర్సించారు. రాష్టాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతామని ఆమె చెప్పారు. సిడబ్ల్యుసి ప్రకటనను తాము ఊహించలేదని ఆమె అన్నారు. తాను సమైక్యవాదినే అని, ఆంటోనీ కమిటీ పిలుపు కోసం చూస్తున్నామని ఆమె చెప్పారు.
ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి వట్టి వసంతకుమార్‌కు ప్రభుత్వోద్యోగుల నుంచి సమైక్య సెగ తగిలింది. రాష్ట్రం విడిపోదనే ప్రగాఢ విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ఓడించిన తర్వాత రాజీనామా చేసి ఆమోదించుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణవాదుల పోరాటం వల్లనే విభజన ప్రకటన వచ్చిందని ఆయన అన్నారు.
శానససభ తీర్మానం లేకుండా ఓ రాష్ట్రం కూడా ఏర్పడలేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల్లో ఐక్యత లేకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications