ఫొటో జర్నలిస్టు గ్యాంగ్ రేప్: ఐదుగురూ ముంబైవారే
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులోని ఐదుగురు నిందితులు కూడా ముంబైలో పుట్టి పెరిగినవారేనని, వారిలో మైనర్లు ఎవరూ లేరని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ సోమవారంనాడు చెప్పారు. ఐదో నిందితుడిని కూడా సెప్టెంబర్ ఐదో తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఐదుగురు కూడా రౌడీ షీటర్లని ఆయన చెప్పారు.
అత్యాచారం చేసిన తర్వాత బాధితురాలి ఫొటోలు తీశారని భావిస్తు్న మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని, ఒక్క ఫొటో మాత్రమే తీసినట్లు కనిపిస్తోందని, అది కూడా అందుబాటులోకి రావడం లేదని, దాన్ని పొందే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

నిందితుడిగా వ్యతిరేకంగా ఆ సాక్ష్యాన్ని పొందడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, గుజరాత్ ఫోరెన్సిక్ లాబొరేటరీ సాయం తీసుకుంటామని ఆయన అన్నారు. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ప్రక్రియ సాగుతోందని, సాధ్యమైనంత తొందరగా చార్జిషీట్ దాఖలు చేస్తామని సత్యపాల్ సింగ్ చెప్పారు.
1993 బొంబాయి వరుస పేలుళ్ల కేసులో, 26/11 ముంబై దాడుల కేసులో వాదించిన ఉజ్వల్ నికం ఫొటో జర్నలిస్టు అత్యాచారం కేసులో ప్రాసిక్యూషన్‌కు నేతృత్వం వహిస్తారని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు.
ఐదుగురు నిందితుల్లో చందూ బాబు సత్తార్ షేక్, విజయ్ జాదవ్, మొహమ్మద్ ఖాసింలపై క్రిమినల్ రికార్డులున్నాయని పోలీసు కమిషనర్ చెప్పారు. ఇంతకు ముందు కూడా నిందితులు ఇటువంటి అత్యాచారాలు చేశారా, లేదా అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే, తమకు ఏ విధమైన ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అత్యాచారం పథకం ప్రకారం జరిగింది కాదని అన్నారు.












Click it and Unblock the Notifications