విభజన: సూటిగా చెప్తున్నా ఢిల్లీలో ప్రయత్నాలు
న్యూఢిల్లీ: ఎపిఎన్జీవోలకు, సీమాంధ్ర రాజకీయ నేతలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వంటి వారి నుండి కూడా తెలంగాణ నిర్ణయం వెనక్కి తీసుకునే విషయమై ఎలాంటి హామీ రావడం లేదు. మంగళవారం ప్రధానిని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజనతో ఇరు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నుండి మాత్రం వారికి ఎలాంటి హామీ రాలేదు. విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని తీసుకుందని, సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మార్చలేమని ప్రధాని వారితో సూటిగా చెప్పారు. విభజనతో వచ్చే సమస్యల పరిష్కారానికి మాత్రం కృషి చేస్తామని, సీమాంధ్రులు చెప్పే సమస్యలన్నింటి పైన దృష్టి పెడతామని ఢిల్లీ పెద్దలు తమను కలిసిన సీమాంధ్ర నేతలకు, ఉద్యోగ సంఘ నేతలకు చెబుతున్నారు.

తెలంగాణపై గత నెలాఖరులో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి పలుమార్లు కాంగ్రెసు పార్టీ పెద్దలు వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రోజుకోసారి అన్నట్లు ఈ విషయాన్ని పదే పదే వల్లె వేస్తున్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే వంటి వారితో పాటు స్వయంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తెలంగాణపై తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎపిఎన్జీవోలు, సీమాంధ్ర ప్రాంత నేతలు తమ వంతు ప్రయత్నాలు మాత్రం మానుకోవడం లేదు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మార్చలేమని ప్రధాని చెప్పారని, తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారన్న అశోక్ బాబు.. సమైక్యాంధ్ర కోసం తమ ప్రయత్నాలు చేస్తామని పునరుద్ఘాటించారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రధానిని, రాష్ట్రపతిని కలిశారు.
విభజనతో సమన్యాయం కావాలని లేదంటే యథాతథంగా ఉంచాలని వారు కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్యాయం అని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ పార్టీ సమైక్యాంధ్ర కోసమే లాబీయింగ్ చేస్తోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారు కూడా ఢిల్లీ పెద్దలకు తమ సమైక్యవాణిని వినిపించనున్నారట. అయితే, ఎవరు ఏం డిమాండ్ చేసినా విభజనపై తగ్గేది లేదని, సీమాంధ్ర సమస్యలను విని, తీర్చేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications