జగన్ గురించి ఆరాతీసిన ప్రణబ్, రేపు విజయమ్మ ధర్నా
న్యూఢిల్లీ: విభజన తీరును నిరసిస్తూ హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరసన దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరా తీశారు. మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, కడప పార్లమెంటు సభ్యురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో రాష్ట్రపతి వారి నుండి జగన్ దీక్ష పైన ఆరా తీశారు. జగన్ దీక్ష గురించి తనకు సమాచారం ఉందని కూడా వారికి చెప్పారు. మరోవైపు అంతకుముందు వారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని ప్రధాని తమతో అన్నారని వారు చెప్పారు. విజయమ్మ జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్‌ను కలిశారు.

రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష
విభజన తీరును నిరసిస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసన ధర్నా చేపట్టనుంది. ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ధర్నా చేస్తారు. ఈ ధర్నాలో వైయస్ విజయమ్మ పాల్గొంటారు.
జగన్ పైన బొత్స
వైయస్ జగన్ జైలులో దీక్ష చేస్తున్నారో ఏం చేస్తున్నారో తనకు తెలియదని, నాలుగు గోడల మధ్య అది జరుగుతుందని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. పలువురు ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో పార్టీని వీడుతున్నారన్నారు. పార్టీలో ఉన్నప్పుడు వారు సొంత పనులు చేయించుకున్నారని ఆరోపించారు. ఇరు ప్రాంత ఉద్యోగులు సంయమనం పాటించాలని కోరారు.












Click it and Unblock the Notifications