వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, చంద్రబాబు: సీమాంధ్రలో ఎవరిది పైచేయి?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీమాంధ్ర ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బస్సు యాత్రను గుంటూరు జిల్లా నుంచి ప్రారంభించగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వదిలిన బాణం వైయస్ షర్మిల తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.

ఇరువురు నాయకులు కూడా కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చిన లేఖనే కారణమని షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. కాగా, తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అప్పట్లో రాష్ట్ర విభజనకు పునాది వేసింది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డేనని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై, కాంగ్రెసు పెద్దలపై షర్మిల విరుచుకుపడుతుండగా, చంద్రబాబు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Chandra Babu Naidu

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదట గళమెత్తి తీవ్రంగా నిరసించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసు. తెలంగాణ ప్రాంతాన్ని వదులుకోవడానికి సిద్ధపడి, సీమాంధ్రలో పైచేయి సాధించి, పట్టు సాధించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా సమైక్య నినాదాన్ని అందుకుంది. తొలుత సమన్యాయం డిమాండ్‌తో ముందుకు వచ్చిన ఆ పార్టీ షర్మిల యాత్రతో మొత్తంగానే సమైక్య నినాదాన్ని అందుకున్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ దీక్షలు చేశారు. కానీ షర్మిల యాత్రకు సమైక్య శంఖారావం అని పేరు పెట్టి పూర్తి స్థాయిలో సమైక్య నినాదాన్ని అందుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి మారడంతో దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఉన్న కాస్తా నాయకులు కూడా పార్టీకి రాజీనామాలు చేశారు. అయినా ఫరవాలేదంటూ సీమాంధ్రపై పట్టుకు సమైక్యవాదాన్ని భుజానికెత్తుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే తాము పోరాడుతామని చెబుతున్నారు.

నిజానికి, తెలంగాణపై తాము ఏమీ చేయలేదని, పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, తెలంగాణ ఇవ్వాలనుకుంటే రాజ్యాంగంలోని 3వ ప్రకరణను వాడుకోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. ఇదే వాదనను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని విజయమ్మతో సహా సీమాంధ్రకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుకుంటూ వచ్చారు. తెలంగాణ అమరవీరులకు విజయమ్మ నివాళులు కూడా అర్పించారు. కానీ, చివరకు కేంద్ర ప్రభుత్వం విభజనకు నిర్ణయం తీసుకునే సరికి పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. దీంతో సీమాంధ్రలో తమ పార్టీ పట్టు పెంచుకుంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కాగా, చంద్రబాబు పరిస్థితి వేరు. ఆయన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు అనుకూలంగానే అఖిల పక్ష సమావేశంలో కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఇదే విషయం తెలంగాణ పర్యటనల్లో చెప్పారు. విభజన నిర్ణయం జరిగిన తర్వాత కూడా ఆనయ దానికి కట్టుబడడానికి మానసికంగా సిద్ధపడినట్లు కనిపించారు. అందుకే, సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగు నుంచి ఐదు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

YS Sharmila

అయితే, వైయస్సార్ కాంగ్రెసు దూకుడుతో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కొంత మంది సమైక్యనినాదాన్ని అందుకున్నారు. కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు, వైయస్సార్ కాంగ్రెసు నాయకులు సీమాంధ్రలో సమైక్యవాదం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు బస్సు యాత్రకు బయలుదేరారు. తన తెలంగాణ అనుకూల వైఖరి నుంచి కాస్తా పక్కకు జరిగి ఆయన మాట్లాడుతున్నారు. వాజ్‌పేయ్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అడ్డుకున్నది తానే అని, తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా లేనని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీమాంధ్రలో ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణపై కేంద్ర మంత్రివర్గంలో నోట్ పెడుతారా అని ఆయన ప్రశ్నించారు. దానికితోడు, విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చి, దాని గురించి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు దాదాపుగా ఏమీ మాట్లాడని, ఏమీ చేయని చంద్రబాబు సీమాంధ్రలో మాత్రం కార్యాచరణకు దిగారు. ఇది తెలంగాణ నాయకులకు నచ్చడం లేదు. దీంతో వైయస్ జగన్‌తో పాటు చంద్రబాబును కూడా తెలంగాణ నాయకులు లక్ష్యం చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి సీమాంధ్ర నాయకులు కూడా వైయస్ జగన్‌ను, షర్మిలను, విజయమ్మను తప్పు పడుతున్నారు. చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. అయినా, కాంగ్రెసు నిర్ణయాన్ని తప్పు పడుతూ చంద్రబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద, సీమాంధ్రలో పట్టు కోసం వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారని చెప్పవచ్చు.

English summary
YSR Congress party president YS Jagan and Telugudesam party president Nara Chandrababu Naidu are trying to take advantage with United Andhra slogan in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X